Thursday, 14 August 2025

యుద్ధాలకు మూలం దేశభక్తి, మత భావనలే

 యుద్ధాలకు మూలం దేశభక్తి, మత భావనలే

—---------------------------------------------

*ఆయుధాలకు ఆశీర్వాదం ఇస్తున్న మతాలు

*మనుషులను విభజిస్తున్న జాతీయభావాలు

*సంబంధాలను ధ్వంసం చేస్తున్న విశ్వాసాలు

*హింసకు, దుఃఖానికి ఈ విభజనలే కారణం

—------

మనిషి కన్నీళ్లు ఈ హత్యాకాండను ఆపలేవు

*విభజనలు ఉన్నంత కాలం శాంతి అసాధ్యం.

*మాటల్లో కాదు, విభజనలను అధిగమించాలి

*మనలోని సంఘర్షణను అంతం చేసుకోవాలి

యుద్దాలపై జిడ్డు కృష్ణమూర్తి అపూర్వ దృష్టికోణం

*యుద్దాలపై జె. కృష్ణమూర్తి రచనలు శాంతి కోసం మన హృదయాల్లో ఉండాల్సిన తపనను, విభజనలను అధిగమించి సమగ్రమైన జీవనాన్ని సాధించే మార్గాన్ని స్పష్టంగా చూపిస్తాయి.

—-----------

         మనం దేశభక్తి అనే పేరుతో ఒకరినొకరు విడదీస్తాం, గొడవలు పెట్టుకుంటాం, యుద్ధాలు చేస్తాం. కానీ, ఈ దేశభక్తి అనేది నిజంగా మనల్ని ఒక్కటి చేస్తుందా? లేక మనలోని హింసను, విభజనను పెంచుతుందా? పాఠశాలల్లో, వార్తాపత్రికల్లో, ప్రచారాల్లో ఊదరగొట్టే ఈ జాతీయతా భావం మనలో గర్వాన్ని నింపుతుంది, కానీ అదే సమయంలో మనుషుల మధ్య గోడలు కడుతుంది. హింస అంటే కేవలం చంపడం కాదు—మన మనసుల్లోని ఈ విభజన భావం, ఆధిపత్యం, అసూయ, భయం కూడా హింసే. శాంతి కోసం మనం మనల్ని మనం అర్థం చేసుకోవాలి, మన దేశాలను కాదు. ఈ ఆలోచనలో మనం ఒక మానవుడిగా, హింస లేని జీవనం కోసం బాధ్యత తీసుకుంటామా?

      మనిషి వేల సంవత్సరాలుగా శాంతి కోసం మొరపెడుతున్నాడు. కానీ అతని కన్నీళ్లు కూడా అతని హింసాత్మక స్వభావాన్ని శుద్ధిచేయలేకపోయాయి. మతాలు యుద్ధాలకు దీవెనలిచ్చాయి. ప్రభుత్వాలు సైనికీకరణను పెంచుతున్నాయి. నీవే నీ పిల్లలను చావడానికి, చంపడానికి తయారు చేస్తున్నావు! ... వీటిని ధ్వంసం చేయకుండా శాంతి అసాధ్యం.

        ఈ భూమిపై అసలైన శాంతి ఎప్పుడూ కనిపించదు. ఎందుకంటే మన జీవితమే విభజనలతో నిండిపోయి ఉంది. జాతులు, మతాలు, భావజాలాలు, భౌగోళిక సరిహద్దులు – ఇవన్నీ మనుషుల మధ్య గోడలు కడుతున్నాయి. ఒక చిన్న పట్టణంలోనే ఎన్నో మత సమూహాలు, సంస్థలు, ఫౌండేషన్లు ఉంటాయి, ప్రతి ఒక్కటీ తమ మార్గమే సరైనదని ప్రచారం చేస్తాయి. మతాలు మనుషుల మధ్య సరైన సంబంధాన్ని నిరోధిస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమించడం కాకుండా, మతపరమైన గుర్తింపులు (హిందూ, క్రైస్తవ, ముస్లిం) మనలను వేరు చేస్తాయి. ఈ విభజన సంఘర్షణను తెస్తుంది. మానవత్వాన్ని బలహీనపరుస్తుంది. ఈ విభజన, శాంతిని దూరం చేస్తుంది. అటువంటి చోట శాంతి ఎలా సాధ్యమవుతుంది? నిజమైన శాంతి అంటే యుద్ధం లేకపోవడమే కాదు. అది మన అంతర్గత లోకంలో సంఘర్షణలు పూర్తిగా అదృశ్యమైపోయిన స్థితి.

         మతం - విభజనకు మూలం

         ఐక్యత, ప్రేమకు సందేశంగా ఉండవలసిన మతాలే మనుషుల మధ్య విభజనకు కారణమయ్యాయి. మత విశ్వాసాలు మనుషుల మధ్య సంబంధాలను ధ్వంసం చేశాయి. హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం వంటి మతపరమైన విభజనలు, జాతీయతలు, రాజకీయ సిద్ధాంతాలు, సామాజిక తరగతులు మనలను విడదీస్తున్నాయి. ఈ విభజనలు యుద్ధాలకు, హింసకు, దుఃఖానికి మూలం. విభజనలు ఎక్కడ ఉన్నాయో, అక్కడ యుద్ధం, హింస, సంఘర్షణ తప్పవు.

శాంతి లేనిదే జీవనం వికసించదు

       మతాలు, ప్రభుత్వాలు మనుషులను విభజిస్తున్నాయి, సంఘర్షణలు సృష్టిస్తున్నాయి, అవినీతిలో మునిగిపోతున్నాయి. గురువులతో, విశ్లేషకులతో మనుషులను వర్గాలుగా, స్వభావాలుగా, విభజిస్తున్నారు. మనుషుల మధ్య విభజనలు ఉన్నంత కాలం శాంతి అసాధ్యం. ఈ విభజనలు కేవలం సిద్ధాంతాలు కావు, అవి నిజంగా ఉన్నాయి. అవి యుద్ధాలకు కారణమయ్యాయి. దురదృష్టవశాత్తూ, యుద్ధాలను ఆపడానికి ఎవరూ నిజంగా ఆసక్తి చూపడం లేదు. రాజకీయ నాయకులు, మత గురువులు శాంతి గురించి మాట్లాడుతారు, కానీ వారి చర్యలు విభజనలను పెంచుతున్నాయి.

         మతాలు శాంతిని ఎలా ప్రభావితం చేస్తాయి?మతాలు, సిద్ధాంతంగా ప్రేమ, ఐక్యత, శాంతిని ప్రోత్సహించాల్సినవి. కానీ వాస్తవంలో, అవి మానవాళిని విభజించడం ద్వారా శాంతిని నిరోధిస్తున్నాయి. హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం వంటి మతపరమైన విభజనలు, వాటి ఉపవిభాగాలు మనుషుల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయి. మత గురువులు, నాయకులు శాంతి గురించి ఎంతో మాట్లాడతారు, కానీ వారి చర్యలు విభజనను, హింసను పెంచుతాయి. మత సంస్థలు తమ అనుయాయులను ఒకరినొకరు వ్యతిరేకించేలా ప్రేరేపిస్తాయి, శాంతిని నిజంగా స్థాపించడంలో విఫలమవుతాయి. ఈ విభజనలు సంఘర్షణలకు, యుద్ధాలకు కారణమవుతున్నాయి. 

గర్వాన్ని, విభజనను, హింసను ప్రేరేపించే దేశభక్తి

—----------

          మనం దేశభక్తి అనే రంగు కళ్లద్దుకుని ప్రపంచాన్ని చూస్తాం. పాఠశాల పుస్తకాలు, వార్తలు, ప్రచారాలు మనలో "మన దేశం గొప్పది, మన జాతి గొప్పది" అని నీరాజనం పలుకుతాయి. కానీ ఈ దేశభక్తి మనలో గర్వాన్ని, విభజనను, హింసను రెచ్చగొడుతుంది. హింస అంటే కేవలం ఆయుధం పట్టడం లేదా చంపడం కాదు—మన మనసులోని "నీవు వేరు, నేను వేరు" అనే ఆలోచన కూడా హింసే.దేశాలు, సరిహద్దులు, జాతీయ గీతాలు మనల్ని ఒక్కటి చేయవు—వాటి వెనుక భయం, ఆస్తుల కోసం ఆశ, ఆధిపత్యం కోసం తాపత్రయం ఉన్నాయి. మనం "మా దేశం" అని చెప్పుకుంటూ, మన పిల్లలనే యుద్ధాలకు బలి చేస్తాం. దేశభక్తి పేరుతో రాజకీయ నాయకులు, అధికారులు మనల్ని ఉపయోగించుకుంటారు—కొత్త భూములు, సంపద, శక్తి కోసం.నిజమైన శాంతి రాజకీయ ఒప్పందాలతో లేదా చట్టాలతో రాదు. అది మనలో మనం మొదలవ్వాలి. మనలోని హింసను, విభజన భావాన్ని అర్థం చేసుకుని, మనుషులందరూ ఒక్కటేనని గుర్తించాలి. దేశం, మతం, భావజాలం కంటే మానవత్వం గొప్పది. మనం ఈ బాధ్యత తీసుకోకపోతే, శాంతి కల్లే కలగానే మిగిలిపోతుంది.

         యుద్ధాల కోసం పిల్లలను సిద్ధం చేస్తున్నాం

        ఇప్పటి ప్రపంచాన్ని పరిశీలిస్తే, అది ఎలాంటి మూర్ఖత్వంతో నిండిపోయిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. పిల్లలను జాగ్రత్తగా పెంచుతాం, కానీ వారు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలని కోరుతాం. యుద్ధంలో మరణిస్తే ఏడుస్తాం. కానీ పిల్లలను చంపడానికి, చనిపోవడానికి సిద్ధం చేస్తాం. ప్రేమతో పెంచుతాం, కానీ వారినే తర్వాత యుద్ధానికి పంపుతాం. చంపడానికి, చనిపోవటానికి. శాంతి గురించి మాటలు చెబుతూ, యుద్ధానికి సన్నాహాలు చేస్తుంటాం. – ముఖ్యంగా ఐరోపాలో - అమెరికాలో లేదా ఇంగ్లాండ్‌లో కాదు - రెండు సంవత్సరాలు, చంపడానికి శిక్షణ పొందుతాడు, యుద్ధానికి సిద్ధమవుతాడు. తల్లిదండ్రులు 'నా బిడ్డను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను' అని అంటారు. అంటే, మీరు మీ బిడ్డను చంపడానికి, చంపబడటానికి సిద్ధం చేస్తున్నారు. యుద్ధాల కోసం పిల్లలను సిద్ధం చేస్తూ.. నాగరికత, ప్రేమ, సౌందర్యం గురించి మాట్లాడతాం., అంతర్గతంగా యుద్ధానికి సన్నద్ధం అవుతున్న మన సమాజం - దీనికి అడ్డుకట్ట వేయడం సాధ్యమేనా? 

          ఏ విధంగా శాంతి సాధ్యమా? మానవాళి కన్నీళ్లు హత్యాకాండను ఆపలేవు. ఏ మతం కూడా యుద్ధాన్ని ఆపలేదు; అన్ని మతాలు ఆయుధాలను ఆశీర్వదించాయి. మతాలు మనలను విడదీశాయి. పాలకులు తమ స్వార్థాల కోసం జాతీయ గర్వాన్ని పెంపొందిస్తున్నారు. శాస్త్రవేత్తలు ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నారు. జాతులు, మతాలు, సరిహద్దులు ఉన్నంత కాలం... భూమిపై శాంతి ఎప్పటికీ రాదు!**  

        జాతీయతలు, మతాలు, రాజకీయ సిద్ధాంతాలు మానవాళిన విడదీస్తున్నాయి, యుద్ధాలకు, దుఃఖానికి కారణమవుతున్నాయి. దేశభక్తి, మతం మనలో గర్వాన్ని రగిలిస్తాయి. కానీ అవే మనుషుల మధ్య గోడలు కడుతాయి. శాంతి అనేది కేవలం మాటల్లో కాదు, విభజనలను అధిగమించి, మన లోని సంఘర్షణను అంతం చేసుకోవడంలో ఉంది. శాంతి కోసం మనం మన హృదయాలను మార్చుకుందాం, సరిహద్దులను కాదు! మనం మనల్ని, ప్రపంచంతో మన సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు, శాంతి సాధ్యమవుతుంది. స్వయంగా కనుగొనవలసిన సత్యం.

(From Chapter 4 - 'Education and World Peace’, The first and last freedom, krishnamurthi‘s journal)

No comments:

Post a Comment