సమస్త విశ్వాసాల నుంచి విముక్తే
‘సహజస్థితి’కి మార్గం!
—---------------------------------
*యూజీ ఆంతర్యాన్ని తెలిపే ప్రధానమైన గ్రంథం
“ది మిస్టిక్ ఆఫ్ ఎన్‌లైటెన్‌మెంట్”
*ఆధ్యాత్మిక ఆలోచనలను సవాలు చేసే గ్రంథం
*“సహజ స్థితి” పై ఘాటైన వ్యాఖ్యానానికి ప్రతిబింబం
*యు.జి. భావనల ఉత్తమ సారాంశం
*భారతదేశం, యూరప్‌లలో విస్తృతంగా ఆదరణపొందిన పుస్తకం
—--
"మిస్టిక్ ఆఫ్ ఎన్‌లైటెన్‌మెంట్" అనే పుస్తకం ఆధ్యాత్మిక రంగంలో ఒక విశిష్టమైన, సామాన్యమైన ఆలోచనలను సవాలు చేసే గ్రంథం. ఇది యు.జి. కృష్ణమూర్తి అనే అసాధారణ వ్యక్తి స్వీయ కథనం. యూ.జి. జీవితాన్ని, అతని అప్రతిహత నిజాయితీని, "సహజ స్థితి" అనేదాని గురించి అతని ఘాటైన వ్యాఖ్యానాన్ని ప్రతిబింబించే ఓ ప్రధాన గ్రంథం. ఆధ్యాత్మికత అనే తాపత్రయాన్ని విస్మరించాల్సిన అవసరాన్ని చెప్పి ప్రకంపనలు సృష్టించిన ఈ పుస్తకం భారతదేశం, యూరప్‌లలో విస్తృతంగా ఆదరణపొందింది. అనేక ముద్రణలకు నోచుకుంది. యూజీ పుస్తకాలు దాదాపు ప్రతి యూరోపియన్ భాషలోకి, అలాగే చైనీస్, జపనీస్ భాషలలోకి అనువాదమయ్యాయి. ఇప్పటివరకు అమెరికాలో విస్తృతంగా ప్రచారం పొందిన ఒక "అండర్‌గ్రౌండ్" ఆధ్యాత్మిక క్లాసిక్ ఇది. యు.జి.కి సన్నిహితంగా ఉన్నవారు ఆయన ఆలోచనలకు ఉత్తమ సారాంశంగా ‘ది మిస్టిక్ ఆఫ్ ఎన్‌లైట్‌న్మెంట్’ ను భావిస్తారు.
*ఆధ్యాత్మిక ఆలోచనలకు సరికొత్త కోణం
అమెరికాలో మొదటిసారిగా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ఈ పుస్తకం ఆధ్యాత్మిక విధానాలపై నిప్పులు చెరుగుతుంది. ఆధ్యాత్మికతపై సూటిగా, తీక్షణ విమర్శలతో సత్యాన్ని వెతికే హృదయాలను కదిలిస్తుంది. సాధించాల్సిందేమీ లేదు, తెలుసుకోవాల్సిందేమీ లేదు — నీవు నీవుగా ఉండటం మాత్రమే నిజం. ఆశను కాదు, నిజాన్ని చూపే గొప్ప గంభీరమైన మౌనకాంతి లాంటి ఈ పుస్తకం, నీలో నీవు ఎదురుపడే ఓ అద్దంలా నిలుస్తుంది. ఆధ్యాత్మిక జిజ్ఞాసులు వెతుకుతున్న సత్యాన్ని సూటిగా, సరళంగా, హృదయానికి హత్తుకునేలా అత్యంత ప్రభావవంతంగా వివరించే ఒక తిరుగులేని గ్రంథం ‘ది మిస్టిక్ ఆఫ్ ఎన్‌లైటెన్‌మెంట్. జ్ఞానోదయం అనేది కేవలం జీవసంబంధమైన ప్రక్రియ అని, సంస్కృతి, షరతులు, శాస్త్ర, మతపరమైన ఆలోచనలు, మానసిక శిక్షణల నుంచి మనిషి సంపూర్ణంగా విముక్తి పొందినప్పుడే శరీరం తన అసాధారణ తెలివితో మనిషిని ‘సహజ స్థితి’లోకి తీసుకెళ్తుందని యూజీ చెబుతారు. గురువులు, సాధనలు, మోక్షం అన్నీ కల్పితమని, నిజంగా ఉన్నదంటే నిత్య జీవితంలో సహజంగా కలిగే స్థితి మాత్రమేనని అంటారు. ఈ సహజ స్థితిని యూ.జి. "ఎన్లైటెన్‌మెంట్"గా పరిగణించడు. ఎందుకంటే ఎన్లైటెన్‌మెంట్ అనేది మన సంస్కృతి సృష్టించిన ఒక భ్రమ,మోహజాలమాత్రమే అని అతను స్పష్టం చేస్తాడు. ఈ సహజ స్థితికి చేరడానికి ఎటువంటి సాధనలూ, మార్గాలూ, గురువులూ అవసరం లేదు.. యుగయుగాలుగా పవిత్ర వ్యాపారం (Holy business) లో ఉన్నవారు దీనిని రహస్యంగా, గూఢంగా చిత్రించారు. నేను ఈ స్థితిని వివరించడంలో మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాను. ‘మీ ఊహల్లో మాత్రమే ఉన్న ఒక స్థితి కోసం సమయం, శక్తిని వృథా చేయవద్దు. మనం కల్పించుకున్న ఈ 'అద్భుత స్థితి' అనే మాయజాలాన్ని చెరిపివేయడమే నా ప్రయత్నం. సహజ స్థితి అనేది అకారణంగా జరుగుతుంది. It just happens. దాన్ని సాధించాలనుకునే ప్రయత్నమే దాని నుంచి దూరం చేస్తుంది.”దాన్ని పొందడానికి ఏమీ చేయలేమని ఆయన ఖరాఖండీగా చెబుతారు. ఆధ్యాత్మిక సాధనల వల్ల కాకుండా, సాధనతో పోరాడి, వాటిని దాటి జీవితకాల అన్వేషణ తర్వాత తాను ఎలా 'విముక్తి' పొందారో ఆయన నిస్సంకోచంగా వివరిస్తారు. ఆధ్యాత్మిక గురువులు, సంస్థలు, సిద్ధాంతాలు, పద్ధతులు విపరీతంగా పెరిగిన ఈ లోకంలో యు.జి. ఈ అన్నింటినీ తిరస్కరించి ఒంటరిగా నిలబడ్డాడు. ఒక ప్రత్యేకమైన గొంతుకగా నిలిచాడు. ఈ పుస్తకం ఆధునిక, ఆధ్యాత్మిక ఆలోచనలను సరికొత్త కోణంలో అర్థం చేసుకునేలా చేస్తుంది.
మనిషిని సహజస్థితికి విశ్వాసాలే ఆటంకం
వ్యక్తి సంపూర్ణంగా సాంస్కృతిక ములాల నుంచి, మత విశ్వాసాల నుంచి, ఆలోచనల తంతుల నుంచి విముక్తి పొందినప్పుడే శరీరం — దానికున్న అసాధారణమైన మేధస్సుతో — మనిషిని సహజస్థితిలో జీవించేలా చేస్తుంది. యూ.జి.కి ఈ అనుభవం "విపత్తు" రూపంలో, ఆయన 49వ పుట్టినరోజున స్విట్జర్లాండ్‌లో జరిగింది. అప్పటి నుంచి ఆయన ఈ సహజ స్థితిలోనే జీవిస్తున్నారు. అప్పటి నుంచి, ఆయన యూరప్, భారతదేశం అంతటా ఈ విషయంపై ప్రామాణికంగా, సాధికారకంగా మాట్లాడే వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ప్రపంచవ్యాప్తంగా సంచరిస్తూ, స్నేహితుల దగ్గర లేదా అద్దె ఇళ్లలో కొన్ని నెలలు గడుపుతూ జీవించేవాడు.
బహిరంగ ప్రసంగాలు చెయ్యడు. అతని వద్దకు వచ్చే వాళ్లతోే చర్చలు జరుపుతాడు. ఈ పుస్తకం అలాంటి సంభాషణల సారాంశం.
*‘వాస్తవం’ వైపు నడిపించేలా ప్రేరేపించే మాటల తూటాలు
అతను ఆశలు, ప్రోత్సాహం ఇవ్వడు, కేవలం నిజాన్ని మాత్రమే చెబుతాడు."నిజం ఒకటే—నేను మీ సమస్యలు పరిష్కరించలేను. మీ మాయాభ్రమల నుంచి కాపాడలేను. నేను చేయలేనిది ఇంకెవ్వరూ చేయలేరు." అతని సందేశం సరళం: అతనికి ఎటువంటి సందేశం లేదు. అయినప్పటికీ, అతని మాటలు మీ ఊహలను, ఉద్దేశాలను ఎదుర్కోవడానికి, సత్యం ఏమిటో మీరే కనుగొనేలా ప్రేరేపిస్తాయి. మన ఊహలను సవాలు చేసి, నిజాన్ని కనుగొనే దారిలో ఒక కాంతిని నింపుతాయి
*విలక్షణమైన గొంతు
యు.జి. కృష్ణమూర్తి ఆధ్యాత్మిక రంగంలో ఒక విలక్షణమైన గొంతు. ఆయన ఆలోచనలు ఆధునిక ఆధ్యాత్మికతను కొత్త కోణంలో చూడమని ప్రేరేపిస్తాయి. జె. కృష్ణమూర్తితో ఆయనకు సన్నిహితమైనా వివాదాస్పదమైన సంబంధం ఉండేది. ఇద్దరూ గురువు పాత్రను తిరస్కరించారు, సత్యం, స్వరూపాన్ని అన్వేషించడానికి సంభాషణలు జరిపారు. కానీ చివరికి వారి దారులు వేరయ్యాయి.
*అమూల్యమైన మార్గదర్శిని
"ది మిస్టిక్ ఆఫ్ ఎన్‌లైటెన్‌మెంట్" అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న లేదా దానిలోకి అడుగు పెట్టాలని ఆలోచిస్తున్న వారందరికీ ఒక అమూల్యమైన మార్గదర్శిని. ఆధ్యాత్మిక ప్రపంచం, పవిత్రమైన వ్యాపారం (holy business) గురించి లోతుగా తెలిసిన ఒక వ్యక్తి అంతరంగ కథను (inside story) ఇది వివరిస్తుంది. ఆధ్యాత్మిక సాధనల వల్ల కాకుండా, వాటిని దాటి జీవితకాల అన్వేషణ తర్వాత తాను ఎలా 'విముక్తి' పొందారో స్పష్టంగా, సూటిగా మనసుకు తాకేలా చెబుతుంది. జీవితకాల ఆధ్యాత్మిక సాధన ఉన్నప్పటికీ, అది కారణంగా కాకుండా, దానిని ఎదిరించి ఆయన ఎలా ‘స్వతంత్రుడు’ అయ్యారో స్పష్టంగా, నిజాయితీగా వెల్లడిస్తుంది.
ఈ పుస్తకం ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవారు, సత్యాన్ని అన్వేషించే వారు తప్పనిసరి చదవాల్సిన రచన. అతని సందేశం ఇవ్వడు, ఆశలు కల్పించడు. కానీ నిజాన్ని చూడాలనుకునే వాళ్లకు ఇది ఓ నిర్లిప్తంగా కనిపించినప్పటికీ హృదయాన్ని తాకే అద్దంలా ఉంటుంది.
—----------
-యు.జి.కృష్ణమూర్తి భావనలను తెలుగులో తెలుసుకుందామని ఆశక్తి ఉన్నవారు నా బ్లాగు
ugtelugu.blogspot.com (అచింతనాపరుడు) నుంచి తెలుసుకోవచ్చు
సమాజం, సంస్కృతి, జీవితం, పేదరికం, మానవ సంబంధాలు, దేహం, ఇంద్రియాలు, సహజస్థితి, ఆహారపు అలవాట్లు, చైతన్యం, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక గురువులు, గతం, వర్తమానం, దాతృత్వం, మనస్సు, ఆలోచన, కవులు, రచయితలు, కళాకారులు..ఇలా భిన్న అంశాలపై యూజీ ఏం చెబుతాడు? అని రేఖా మాత్రంగానైనా తెలుసుకోవడానికి ఈ బ్లాగును దర్శించవచ్చు.
No comments:
Post a Comment