Friday, 27 June 2025

‘ది బయాలజీ ఆఫ్ ఎన్‌లైటెన్‌మెంట్ 2 ” అనే

 యు.జి.కృష్ణమూర్తిని గురించి తెలుసుకుందామనుకునే వారికి ‘ది బయాలజీ ఆఫ్ ఎన్‌లైటెన్‌మెంట్ ” అనే పుస్తకం ప్రధానమైనది. యు.జి. ప్రసంగాలు, సంభాషణలతో కూడిన 200 గంటల టేపులు, రికార్డింగుల సమాహారం ఈ పుస్తకం. బెంగళూరులో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆంగ్ల భాష ఆచార్యులు ముకుందరావు సంపాదకత్వంలో ఈ గ్రంథం వెలువడింది. చాలా ఆసక్తికరమైన దృష్టికోణాన్ని ఇస్తుంది. ఈ పుస్తకంలో మనం ఆధునిక జ్ఞాని యు.జి. కృష్ణమూర్తిని కలుస్తాం. జీవితం, వాస్తవికత గురించి స్పష్టంగా, సూటిగా మాట్లాడే ఆయన స్వరాన్ని వింటాం. శరీరం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి? ఆత్మ అనేది ఉందా? దేవుడు, పరలోకం వంటివి వాస్తవమేనా? జ్ఞానోదయం అంటే ఏమిటి? మరణానంతర జీవితం ఉందా?.. ఇవే కాదు, రాజకీయాలు, మతాలు, మానవ సంబంధాలు, ప్రేమలు, ఆహారం, ఆరోగ్యం రుచులు, అభిరుచులు ఇలా ఎన్నో ప్రాథమికమైన ప్రశ్నలకు ఇంత సరళంగా, నిజాయితీగా, సూటిగా, స్పష్టంగా, ధైర్యంగా ఎన్నడూ చర్చించని అంశాలను మనం చూస్తాం. ఈ పుస్తకంలో 1967-71 మధ్య కాలంలో యు.జి.తన స్నేహితులతో జరిగిన ఈ అప్రచురిత సంభాషణలలో, తన సత్యాన్వేషణ గురించి, 1967లో తన శరీరంలో జరిగిన తీవ్రమైన జీవసంబంధమైన మార్పుల గురించి వివరంగా చెబుతారు. దీనిని జ్ఞానోదయం అనడం కంటే సహజ స్థితి అని పిలవడానికి ఆయన ఇష్టపడతారు. ఈ మార్పు మనస్సులో కాదు, మానవ శరీర నిర్మాణంలోనే జరిగిందని ఆయన స్పష్టంగా చెబుతారు. బుద్ధుడు, యేసు, ఆధునిక కాలంలో శ్రీ రమణ మహర్షి వంటి జ్ఞానులు చేరిన సహజ స్థితి ఇదే అనే అభిప్రాయం ఉంది. యు.జి. మాత్రం మోక్షం అనేది ఎటువంటి ఆధ్యాత్మిక సాధన కాదని, అది పూర్తిగా శరీర సంబంధమైన సహజ స్థితి అంటారు. మోక్షం అనేది ఒక ప్రత్యేక లక్ష్యం కాదు, మనపై పడిన సాంస్కృతిక ప్రభావాలు, మానసిక ఊహలు తొలగిపోతే సహజంగా కలిగే స్థితి. ఇది శరీరంలో జరిగే ప్రక్రియ మాత్రమే, మనస్సుతో సంబంధం లేదు. అతి సామాన్యులలో కూడా ఈ స్థితి ఉంటుందన్నారు. ఆలోచనల కలయక, కొనసాగింపునకు బ్రేక్ పడతే మనమందరం సహజంగా ఇదే స్థితిలో ఉంటామని యు.జి. నిరంతరం గుర్తు చేస్తుంటారు. చాలా మంది యూ.జి.ని జ్ఞానోదయమైనవారిలో ఒకరుగా చూస్తూ, ఆయనను గొప్ప ఆధ్యాత్మికుడిగా కీర్తించాలనుకున్నారు. కానీ తాను కేవలం “ప్రాకృతిక స్థితి”లో ఉన్నవాడినని చెప్పారు. ఆయన దృష్టిలో, జ్ఞానోదయమనే పేరుతో మనుషులు కల్పించుకునే తర్కహీనమైన భావనలు, ఆధ్యాత్మిక ఆలోచనలు – ఇవే అసలైన ఆటంకాలు అంటారు. జ్ఞానోదయంపై (ఎన్‌లైటెన్‌మెంట్) ప్రత్యేక దృక్కోణాన్ని అందించారు. తాను "‘అతార్కిక (Unrational)" అని చెప్పుకోవడాన్ని ఇష్టపడేవారు. ఎందుకంటే జ్ఞానోదయం గురించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తార్కికతను ఉపయోగించడం అనే ఆలోచనను ఆయన పూర్తిగా తిరస్కరించారు. అంతిమ సత్యాన్ని అన్వేషించడం అనే భావన అసంబద్ధం. అర్థం లేని పని. లోకంలో జరిగే ప్రతిదీ కేవలం జరుగిపోతూ ఉంది. దాని వెనుక దైవిక జోక్యాలు లేదా ఆధ్యాత్మిక, రహస్యమైన సంబంధాలు ఏమీ లేవు అంటారు. ఆధ్యాత్మిక అన్వేషణను వదిలేసి, ప్రత్యక్ష అనుభవం, సహజ స్థితిని అంగీకరించే జీవనశైలిని యు.జి. కృష్ణమూర్తి ప్రోత్సహించారు. సంప్రదాయ ఆధ్యాత్మికతకు విరుద్ధంగా, ఆయన మరింత వాస్తవపరమైన, ఆచరణాత్మకమైన దృక్పథాన్ని సూచించారు.


*మొదట జిడ్డు కృష్ణమూర్తి వీరాభిమాని అయిన రచయిత ముకుందరావు స్పందన

'యు.జి. కృష్ణమూర్తితో మొదటి సమావేశం నన్ను కుదిపేసింది. పూర్తిగా కుదేలయ్యాను. జె.కె ‘మార్గం లేని మార్గం’ నాలో ఒక మార్గంగా రూపాంతరం చెందిందని నేను గ్రహించాను. అది నిజంగా నిరాశాజనకంగా అనిపించింది. సత్యం కోసం వెతకడం అర్థరహితంగా, వ్యర్థంగా అనిపించింది, ఎందుకంటే ఏ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఆ లక్ష్యం నుంచి మరింత దూరం చేస్తాయి. యు.జి. చెప్పినట్లు, ఇది కుక్క, దాని ఎముక కథ లాంటిది. ఆకలితో ఉన్న కుక్క ఒక ఎండిన, కండలేని ఎముకను కొరుకుతుంది. అలా చేయడం వల్ల దాని చిగుళ్ళు గాయపడి రక్తం కారుతుంది. కానీ ఆ కుక్క, తాను రుచి చూస్తున్న రక్తం తన నుంచి కాదని, ఎముక నుంచి వస్తుందని భావించి పరవశిస్తుంది. విషయం చాలా స్పష్టంగా ఉంది. సమస్య ఏంటంటే — సమాధానమే సమస్యగా మారిపోయింది! ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది. ఆ ప్రశ్నే ‘నేను’! అంటారు యు.జి.

జె. కృష్ణమూర్తి నా ఆధ్యాత్మిక అన్వేషణను, మోక్షం పొందే ఆశను చిదిమేస్తే, యూ.జీ. అంతకన్నా తీవ్రంగా, నేను ఇప్పటికీ ఏదో ఆశతో కొనసాగిస్తున్న ఆ అన్వేషణకి మౌలికంగా పునాదినే కూల్చేశాడు. ఇక దానికి ఏర్థం లేకపోయింది. అంతా వ్యర్థంగా అనిపించింది. ఈ వెతకటం, ఈ తపన—గడ్డి వాములో సూదిని వెతకడంలా? లేక చీకటి గదిలో నలుపు పిల్లిని వెతకడంలా? మరి సొంత నీడ వెంబడించడంలా? ఇది కేవలం నిరుపయోగంగా లేదా నిస్సారంగా అనిపించింది. హానికరం కూడా అనిపించింది.

నిజం చెప్పాలంటే డెబ్బైలో నేను మొదటిసారి యూజీని విన్నప్పుడు చాలా కోల్పోయాను. అప్పుడు జేకేనే అంతిమం, సంపూర్ణ మైన ధార్మికం(extreme soirituvality ), దాన్నిదాటి ఎవరూ వెళ్ళలేరు`.అనేభావనతో ఉన్నాను. మళ్లీ యూజీని(రెండోకృష్ణమూర్తిని) కలిసినపుడు అతను జేకే చెప్పింది మొత్తం`రొమాంటిక్ హగ్వాష్`, కేవలం కల్తీలేని కల్పన(అన్ఆడాల్ట్రేటెడ్ ఫాంటసి),అంతకుమించి ఏమీ లేదు ` అనికొట్టేయడం నన్ను దిగ్బ్రమకు, అత్యంత భయానికి గురిచేసింది. నాతల మండుతున్నట్టు, మొత్తందేహం నిప్పుల కొలిమిలో ఉన్న అను భూతిని జేకే కలుగ జేస్తే .యూజీనా తలనే మాయంచేసినట్టు, ఏ మాత్రం పసలేని ఆలోచనా పరుడిగా, ఒక జీరో ననే భావనను కలిగించాడు' అని ముకుందరావు తనపై య.జి.ప్రభావాన్ని వివరించారు.

                

మహేష్ భట్ స్పందన                                                 

'ది బయాలజీ ఆఫ్ ఎన్‌లైటెన్‌మెంట్' ఆవిష్కరణ సందర్బంగా ప్రముఖ సినీదర్శకుడు, నిర్మాత మహేష్ భట్ స్పందన..

"నా గురువు కోసం కాపలాగా ఉండటంలో, నేను ఇప్పటికే నా జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించాను. యు.జి. వంటి వ్యక్తి జీవితానికి పూర్తి విరామం లేదా ముగింపు ఉండదని నేను నమ్ముతాను. అందుకే నాకు వీడ్కోలు అనే భావన రాలేదు. నా గురువు నాకు వీడ్కోలు చెప్పకుండానే వెళ్లిపోయారు," అని భావోద్వేగంతో చెప్పారు’ మహేష్ భట్

No comments:

Post a Comment