Friday, 25 July 2025

నీకు నీవే నమూనా!

 నీకు నీవే నమూనా!

జీసస్, బుద్ధుడు, కృష్ణుడు కాదు

యు.జి.కృష్ణమూర్తి

—----------------------------

జీసస్, బుద్ధుడు లేదా కృష్ణుడి నమూనాలను ఉపయోగించడం ద్వారా, ప్రకృతి సహజంగా విలక్షణమైన వ్యక్తులను సృష్టించే అవకాశాన్ని మనం నాశనం చేసుకున్నాం.

—---------------

ప్రతిఒక్కర్నీ ఒకే మూసలో ఉంచడానికి బాధ్యత వహించే ‘మీ విలువల వ్యవస్థే’ మానవ బాధలకు, మానవ విషాదానికి కారణం.

—-----------

"మోడల్‌లు మిమ్మల్ని ‘బ్రహ్మజ్ఞానులు’గా కాదు…

'జ్ఞానబాధితుల’గా మారుస్తాయి!"

—-----------

ఇటువంటి మోడల్స్‌ను అనుసరించమని చెప్పే వారు – వారు ఎంత పవిత్రులైనా సరే – మనల్ని తప్పుతో పట్టిస్తున్నారు. ఇది ఒక అంధుడు మరొక అంధుడిని నడిపించడమే!

—---------------

బుద్ధుడిలా ఉండాలనుకుంటాం…"

"జీసస్ లా ప్రేమించాలనుకుంటాం…"

ఇలా మనమంతా పరిపూర్ణతను నమూనాల రూపంలో చూస్తూ ఉన్నాం. పరిపూర్ణ మోడల్స్ – వ్యక్తిత్వ వికాసానికి శత్రువులే!”

—------------

‘ప్రతి ఒక్కరూ ఒక విశిష్ట రచన, కాపీలు కాదు.’

—--------

“నువ్వు ఎవరో మరొకరిని అనుకరించే క్షణంలోనే… నీవైపు ద్వారం మూసుకుంటుంది.”

—--------

నీలోని రక్షకుణ్ణి మేల్కొల్పు – ఆదర్శాల కాపీ కాదు.

అనుకరణ కాదు.. స్వయంగా వికసించు

—----------

నీవు నీ ప్రత్యేకతను విస్మరించిన క్షణమే – జీవితం యాంత్రికంగా మారుతుంది.”

—-----------

ప్రకృతి పరిపూర్ణ వ్యక్తిని కాదు, పరిపూర్ణ జాతిని సృష్టించాలనే చూస్తుంది.”

------------

ప్రకృతి లక్ష్యం ‘ఆత్మసిద్ధి’ కాదు, అనుకూలత (adaptability).

—-----------

ఈ భూమ్మీద ఏ రెండు ఆకులు, రెండు మొక్కలు, రెండు హృదయాలూ ఒకేలా లేవు. అయితే మనం ఎందుకు ఒకే త్రికరణంగా, ఒకే మోడల్‌ను ఆరాధిస్తున్నాం?

—--------

ఆత్మసాక్షాత్కారం, మోక్షం, ధ్యానం, సమాధి – ఇవన్నీ మనం సృష్టించిన మోడల్స్! వాటి లోపల జీవించే ప్రయత్నమే మన అసలు బాధ.

—-------

అవతారాలను అనుసరించడం కాదు — వ్యక్తిగత మేల్కొల్పే మానవ వికాసానికి అసలైన మార్గం.

—--

బుద్ధుడైనా, జీసెసైనా, కృష్ణుడైనా…

వారిని గుర్తుంచుకోవడం సరే.

కానీ వారిలా మారాలనే తపనే అసలు బంధనం.

—-----------

 “పుణ్యమూ, శ్రద్ధా, మోక్షాలన్నీ సొమ్ము చేసుకునే మానసిక బజార్లు.”

యేసుని అమ్ముకునే పాస్టర్లూ, బుద్ధుని ప్యాకేజీ చేసే గురు యూనివర్సిటీలూ, భక్తిని బిల్లు చేసే మత పెద్దలూ… ఇది సౌలభ్యం కోసం మానవ విలువల విక్రయం.

—--------------

తననూ, తన మార్గాన్నీ మోడల్‌గా చెప్పేవాడెవడైనా… నీ మీద దురాగతమే చేస్తాడు.”

—-------

శాశ్వతమైన ‘నేను’ అన్నది లేదు.

నీవు ‘నేను’ అంటున్నది – జ్ఞాపకాల చిత్తు మాత్రమే.”

—----------

“నీవు అసలైన కొత్త అనుభూతిని ఎప్పటికీ అనుభవించలేవు. నీవు అనుభవం అంటున్నది… గతానికి ప్రతి రూపం.”

—-------------------------------------------

సంస్కృతి, సమాజం, లేదా ఏది అని పిలిచినా – అది ‘పరిపూర్ణుడి’ నమూనాను మన ముందుంచింది— అదే మానవతకు గొప్ప ఆధ్యాత్మిక గురువుల నమూనా. కానీ ‘ప్రతి ఒక్కరూ అలా మారగలమా? అసాధ్యం! నీవు నీ స్వంత ప్రత్యేకతతో ఒక విశిష్ట వ్యక్తివి. వారిని అనుకరించడం ద్వారా నీవు నీ గుర్తింపును కోల్పోతావు. ఇక్కడే మనమంతా మానవజాతి మొత్తానికి ఒక గొప్ప సమస్యను సృష్టించుకున్నాం. 

కమన సంస్కృతి ఏమంటుంది?

"ఇతనిలా ఉండాలి. అమెలా మాట్లాడాలి. వీరిలా ప్రేమించాలి."ఈ మోడల్స్ వల్లే అసలు మన సహజత్వాన్ని తుడిచిపెట్టుకుంటున్నాం.

మనిషిలోనే ఒక రక్షకుడు ఉన్నాడు – అతను బయట కాదు, లోపలే. ఆ రక్షకుడు వికసించాల్సిందే. అతనికోసం మీరు బుద్ధుడిని పోలాల్సిన పనిలేదు.

మీ సహజతే మీ మార్గం.

 శతాబ్దాలుగా మన మెదడులను కడిగివేశారు – మానవ పరిణామం అంతిమ ఫలితం జీసస్, బుద్ధుడు, కృష్ణుడు లాంటి లాంటి పరిపూర్ణ ఆధ్యాత్మిక గురువులను సృష్టించడమని". కానీ, ప్రకృతికి పరిపూర్ణ వ్యక్తిని సృష్టించడంలో ఆసక్తి లేదు. అది కేవలం పరిస్థితులకు అనుగుణంగా మారే పరిపూర్ణ జాతిని రూపొందించడానికి ఆసక్తి చూపుతుంది. ప్రకృతి ఎలాంటి ఆదర్శాలను, నమూనాలను ఉపయోగించదు. మానవ జాతి సృష్టి ఒక అసాధారణమైన సంఘటన. కానీ సంస్కృతి అందరినీ ఒకే అచ్చులో ఉంచాలనుకుంటుంది – ఇదే మన విషాదానికి మూలం.  

జీసస్, బుద్ధుడు లేదా కృష్ణుడి నమూనాలను ఉపయోగించడం ద్వారా, ప్రకృతి సహజంగా విలక్షణమైన వ్యక్తులను సృష్టించే అవకాశాన్ని మనం నాశనం చేసుకున్నాం. ఎవరైనా నిన్ను వేరొకరిలా ఉండమని చెబితే, ఆ వ్యక్తి ఎంత పవిత్రుడైనా, నిన్ను తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇది ‘గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళకు దారి చూపడం’ లాంటిది.  

‘పరిపూర్ణ వ్యక్తి’ నమూనా అనుసరించడం వల్ల మనం విఫలమయ్యాం. ఆ నమూనా ఎవరిలోనూ ఏ మార్పు తీసుకురాలేదు. ప్రతిఒక్కర్నీ ఒకే మూసలో ఉంచడానికి బాధ్యత వహించే ‘మీ విలువల వ్యవస్థే’ మానవ బాధలకు, మానవ విషాదానికి కారణం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? విలువల వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడం ద్వారా ఏమీ సాధించలేం – ఎందుకంటే మీరు ఒక విలువల వ్యవస్థను ఇంకొక దానితో భర్తీ చేస్తారు.

కాబట్టి, ఏం చేయాలి? నీవు నీ స్వంత ప్రత్యేకతను గుర్తించాలి. నీలోని శక్తిని వెలికితీయాలి. ఈ సమస్యకు పరిష్కారం ఆదర్శాలలో లేదు. అవతారాలు మనకు సహాయం చేయలేవు. మనలోని వ్యక్తిగత శక్తులే సహాయపడతాయి. ప్రతి వ్యక్తిలో ఒక గొప్ప శక్తి దాగి ఉంది. ఆ శక్తిని వెలికితీస్తే, అది వికసిస్తే, అప్పుడు నీలోని నిజమైన ఆదర్శం బయటపడుతుంది. ఇది ఒక వ్యక్తిగత సమస్య – దీనికి అవతారాలేం చేయగలరు? ప్రతి ఒక్కరిలోనూ ఒక రక్షకుడు దాగి ఉన్నాడు.ఆ శక్తిని బయటకు తీసి, వికసింపజేయగలిగితేనే, మార్పు సాధ్యమవుతుంది.  

—-------------------------------------------------

బుద్ధుడు, ఉపనిషత్తులు, జీసెస్, చార్వాకుడు, కబీర్, జైనిజం, సుఫీ, శంకరాచార్యులు, ఇస్కాన్, జుడాయిజం, తివోయిజం తత్వాలతో యూజీకి ఉన్న సామీప్యతలు, భిన్నత్వాలు రేఖా మాత్రంగా…

—--------------

బుద్ధుని సిద్ధాంతం అనిత్యత, శూన్యత, అనాత్మ అనే తత్త్వాల చుట్టూ తిరుగుతుంది. ఒక మార్గాన్ని చూపిస్తారు. ధమ్మపదంలో ‘నీవే నీకు ఆశ్రయం’ అంటారు. 

యు.జి. శాశ్వతమైన ‘నేను’ అన్నది లేదు

నీవు ‘నేను’ అంటున్నది – జ్ఞాపకాల చిత్తు మాత్రమే.” అని అంటారు. యు.జి. బుద్ధునిలా ఆత్మను తిరస్కరిస్తాడు. అయితే మార్గపు అవసరాన్నే ప్రశ్నిస్తాడు.

—-------

ఉపనిషత్తులు- యూ.జి

ఉపనిషత్తులు “ఆత్మ” అనే తత్త్వాన్ని అనిర్వచనీయమైనది, నిరాకారమైనదిగా వివరించాయి. ఆత్మను మాటలతో, మనసుతో, కళ్లతో తెలుసుకోలేరు అంటాయి. ఆత్మ శుద్ధి, బ్రహ్మతో ఏకత్వం, ఆత్మ భావన

ఇక్కడ యు.జి. ఆత్మ అనే భావాన్ని పూర్తిగా కొట్టేస్తాడు. ఆత్మ అనుభవించదగినది కాదు అని —ఆత్మ అనే భావననే మానవ మానసిక నిర్మాణంగా చూస్తాడు. ‘ఆత్మశుద్ది, ‘సాక్షాత్కారం’, పరమాత్మతో ఏకత్వం, ‘అహం’, ‘వాస్తవ స్వరూపం’ అన్నీ మానసిక ముద్రలు, conditioning products. పునరావృత తలంపులే. అవి జీవాన్ని విలీనం చేయవు. జ్ఞాన మిథ్యా భ్రమను బలపరుస్తాయి’ అంటాడు.

—----------

కబీర్- యు.జి.

“కబీర్ ప్రేమలో సత్యం చూశాడు. 

మౌనంలో శాంతిని తాత్వికతను, దివ్యత్వాన్ని చూశాడు. వేల పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం రాదు – ప్రేమ అనే అక్షరాలే నిజమైన జ్ఞానానికి తలుపు అంటారు కబీర్.

యు.జి. ప్రేమ, భక్తి, కవిత్వం అన్నీ తత్వం కాదు — తలంపుల అవశేషం అని నిరాకరిస్తాడు.

వాటిని అభ్యాసంగా పేర్కొంటారు. అనుభూతి కూడా అదే అంటారు. ప్రేమనూ, పూజనూ పవిత్రంగా చూసిన కాలాన్ని యు.జి తిరగరాశాడు. యు.జి.కి ప్రేమ, మౌనం, పూజ అన్నీ తపనలే. శోధనమే శోకం అని చెప్పిన విప్లవ (ర్యాడికల్) ఋషి.”

—---------

సూఫీయిజం- యుజి

యూ.జి. – బయట కనిపించే మతాన్ని తిరస్కరించడంలో సూఫీలతో సమానంగా ఉంటాడు

సామీప్యతలు

—------------

ఇద్దరూ అంతరాన్వేషణే మార్గం అంటారు 

సూఫీలు: "సత్యం బయట కాదు... నీలోనే ఉంది"

యు.జి: "వెలుపల వెతకకు... నువ్వు వెతకడమే బంధం."

సూఫీలు: మౌనంతోనే ఆనందానికి చేరతారు.

యుజి: మాట్లాడే క్షణమే, నిజం తప్పిపోతుంది.

సూఫీలు: మనసు శుద్ధిగా మారితే, దివ్యత్వం సహజంగా వ్యక్తమవుతుంది.

యు.జి: నువ్వు మారాలన్న తాపత్రయం లేకుండానే... సహజంగా ఉన్నావంటే అదే స్వేచ్ఛ.

సూఫీలు: సాంప్రదాయ ధర్మాలను త్రోసిపుచ్చి ప్రేమ అనే మార్గాన్ని ఎంచుకున్నారు.

యు.జి: తాత్విక విధానాలనూ, గురువులనూ, ధ్యానాలనూ తిప్పికొట్టాడు.

భిన్నత్వాలు

—-------

సూఫీయిజం: ప్రేమే మార్గం. ఇష్క్‌ అల్లా అనే విరహానుభూతి.

యూ.జి: ప్రేమ అనేది శరీర స్పందన. దానికి తత్త్వమేం లేదు. ప్రేమ కూడా conditioning అయిన 'pleasure movement'

సూఫీలు: పరమాత్మను ప్రేమించడానికి దేవుడే కేంద్రం.

యు.జి: “దేవుడు అనేది భయంతో పుట్టిన కల్పిత భ్రమ.”

సూఫీలు: ఆనందం అనేది తల్లి ఒడిలో లాంటి అనుభూతి.భక్తి పరవశత.

యు.జి: “ఆనందం అనేది హార్మోన్ల ఆట.శరీర రసాయన చర్య. దాన్ని తత్త్వంగా చేయకండి.”

సూఫీ: ఆనందం – "అనుభవించు – అంతర్లీన దేవుని."

యు:జి: "అనుభవం అంటే – నిన్నటి జ్ఞానం మళ్లీ తలెత్తడం.”

రూమీ ‘తననే మరిచి దైవంతో లయ’ అన్నాడు.

యు.జి.మాత్రం – మరిచిన ‘నేను’ అనేది నిజంగా మరిచిందా? అని అడుగుతాడు.

—-----------

జెన్ బౌద్దం - యు.జి

UG కృష్ణమూర్తి & జెన్ బౌద్ధం మధ్య సంబంధం ఓ ఆసక్తికరమైన తాత్విక ప్రయాణం. ఇద్దరూ మానవ Conditioning మీద గట్టిగా నిలిచిన తాత్వికులే. కానీ: వీరిద్దరినీ పాఠాలు వదిలేసిన తత్త్వవేత్తలుగా, సాధనని ధిక్కరించిన వ్యక్తులుగా ఉన్నా లోపలికి వెళ్తే, సూక్ష్మ భిన్నతలు, విపరీత తాత్విక స్థితిగతులు మన ముందుకొస్తాయి.

—---

జెన్ తత్వం “వాస్తవాన్ని వెతకవద్దు, అభిప్రాయాలను వదిలేయి.”. సాధనను ఆహ్వానించినా, చివరకు వదిలేయడమే లక్ష్యం అంటుంది. యు.జి.కూడా నీవు వెతకే క్షణమే సత్యం మాయమవుతుంది అంటారు.

జెన్: No-mind — ఆలోచనలేని స్థితి.

యు.జి.: "ఆలోచన ఆగాలని కాదు — ఆలోచన అనేది సహజమే. “మీ నాడీ వ్యవస్థ పూర్తిగా స్వేచ్ఛగా స్పందిస్తే, అదే శాంతి.”

జెన్ – గురువు చూపిన బోధి (జ్ఞానోదయం)లో పరమార్థం.

యూ.జి. – "గురువు వచ్చిన క్షణమే నీవు నిన్ను కోల్పోతావు. సాధన, గురువు, మార్గం అన్నీ బంధాలే

జెన్: పుష్పాన్ని చూపి “ఇదే బోధి” అంటుంది.

యు.జి – “ఆ పుష్పాన్ని ఎలా చూడాలో చెప్పే క్షణమే, నీవు నిజాన్ని కోల్పోతావు”

జెన్ – మౌనానికి దారి చూపుతుంది. మౌనాన్ని సాధనగా చూస్తుంది.

యు.జి: మౌనానికి దారి ఉండదు. సాధనతో వచ్చిన మౌనం — మౌనంలా కనిపించవచ్చు, కానీ అది ఓ మేథోబంధం మాత్రమే.

జైన ధర్మం అంటే.. శుద్ధి మార్గం.

అహింస, అపరిగ్రహ, తపస్సు

జీవాత్మ – శుద్ధ చైతన్యం

మోక్షం అంటే కర్మ బంధాల విమోచన.

దీనిపై యు.జి.“నీకు నిన్ను శుద్ధం చేయాల్సిన అవసరం లేదు – అసలు నీవు ఎవరో కావాలనే తపనే తప్పుడు ప్రార్థన.” అంటారు. నిన్ను మార్చుకోవాలన్న తపనే తప్పుడు ఆరంభం. ఎందుకంటే నీవు ఎవరనేది తెలిసే ముందు, నిన్ను శుద్ధి చేయలేవు. జైన తత్త్వంలోని తీవ్ర అనుబంధ నియమాలను – UG conditioningగా చూస్తాడు. తపస్సు, నియమాలు అన్నీ స్వీయబలవంతాలే” అంటారు.

చార్వాకుడు-యు.జి. కృష్ణమూర్తి

—------------

చార్వాకుడు (భౌతికవాదం), ఇద్దరూ ఆధ్యాత్మిక సంప్రదాయ మత ధర్మాలను, క్రతువులను తిరస్కరించారు. స్వర్గం, మోక్షం, పునర్జన్మ లను వ్యతిరేకించారు.

ఇద్దరి మధ్య భిన్నత్వం

చార్వాకుడు – "వాస్తవాన్ని ప్రత్యక్షంగా తెలుసుకో."

యూ.జి – ప్రత్యక్ష అనుభవం కూడా గతానికి సంబంధించిన అభ్యాసమే.”

చార్వాకుడు – "ప్రత్యక్షమే ప్రామాణికం."

యు.జి.– ప్రత్యక్షం” కూడా conditioning లోంచే వస్తుంది. నీవు అనుభవిస్తున్నదే నిజం – కానీ అది conditioning.”

చార్వాకుడు: అనుభవాన్ని ఆలింగనం చేశాడు.

యు.జి – అదే అనుభవాన్ని విచ్ఛిన్నం చేశాడు.

చార్వాకుడు – "ఇంద్రియ సుఖమే లక్ష్యం, పరమానందం."

యు.జి – "ఇంద్రియ సుఖం కూడా జ్ఞాపకాల వలయంలో ఏర్పడిన మాయ."ఇంద్రియ సుఖం అంటే ఏదో శక్తిమంతమైన దృక్కోణం కాదు – అది శరీర ఆత్మసంతృప్తి కోసం నేర్పబడిన వ్యామోహం.”

చార్వాకుడు: జీవితాన్ని విందుగానే చూశాడు.

యు.జి– విందు వెనుక దాగిన తపనల్నే ప్రశ్నించాడు.

—--------

జీసస్- యు.జి.

జీసస్ తనను దేవుని ప్రతినిధిగా, అనేక సందర్భాల్లో దైవపుత్రుడిగా ప్రకటించాడు. ఆయన బోధలో దేవుడు ప్రేమస్వరూపుడు, తండ్రి, రక్షకుడు. మానవుడు పాపవశుడైనప్పుడు దేవుడే మార్గం చూపిస్తాడు.

యు.జి. ప్రకారం, కలగాపులగమైన మనస్సు చాలా విధ్వంసకర విషయాలను సృష్టించింది. అన్నింటిలో దేవుడు అనే భావన అత్యంత విధ్వంసకరమైంది.

దేవుని కోసం మనం చేసే అన్ని తపనలు, ప్రార్థనలు, యాత్రలు అన్నీ —నిజానికి మన లోపలి ఖాళీని నింపే మౌఖిక వినోదమే. మనిషి కేవలం భౌతిక జీవి. (భయోలాజికల్ బీయింగ్ ). స్వాభావికంగా అతనికి ఆద్యాత్మిక పార్శ్వం లేదు. అన్ని సద్గుణాలు, మార్గదర్సికాలు, నమ్మకాలు , భావాలు, ఆద్యాత్మిక విలువలు, కేవలం డాంబికాలు, అసహజమైనవి. అవేమి నీలో మార్పు తీసుకురాలేవు

జీసస్ తనను ఒక మార్గంగా ప్రతిపాదించగా, UG మార్గాలనే భ్రమగా పరిగణించాడు

జీసస్ – ప్రేమను అత్యున్నత మార్గంగా చూపించాడు.

యు.జి – “ప్రేమ కూడా ఒక నేర్పించబడిన తపన మాత్రమే” అన్నాడు. ప్రేమ అనేది కూడా స్వార్థపు స్పర్శతో కలిసిన మరొక తాపత్రయం. ఆ తాపత్రయమే బంధనానికి దారి తీస్తుంది.

జీసస్ ఆశను చూపించాడు.

యు.జి. – ఆశ అనే భ్రమనే ఛేదించాడు.

జీసస్ –పాపం, దేవునికి విరుద్ధమైన పని

యు.జి –. పాపం, పుణ్యం అన్నీ Conditioning మాత్రమే. పాపం–పుణ్యం అన్న పదాలే మానవుని భయాన్ని పెంచే పద్ధతులు. పాపానికి పరిహారం అనేది ఆధ్యాత్మిక మార్కెట్ వ్యూహం మాత్రమే.

—--------

తావోయిజం- యు.జి.

తావో, యు.జి…ఇద్దరూ లక్ష్యం, మార్గం అనే భావనలనే తిరస్కరించారు. యూ.జి. మరింత తీవ్రంగా – అర్థం వెతకడమే మానసిక రుగ్మత అని తేల్చేశాడు.

తావో: సహజంగా ఉండు, ప్రకృతి లయతో జీవించు. "Spontaneity is truth."

యు.జి: నీవు సహజంగా ఉన్నప్పుడు – నీకు తెలియదు నీవు సహజంగా ఉన్నావని. ఒకవేళ నీ సహజత్వాన్ని తెలుసుకున్నావంటే, అది మళ్లీ తలంపే.

తావో ప్రకృతిలో తత్వాన్ని చూసింది. యు.జి. దానిని తలపులే అని తేల్చేశాడు

యు.జి: “నీకు ప్రకృతి కనిపించదు… కేవలం నీకు నేర్పించిన ప్రకృతే గుర్తుకు వస్తుంది.”నీ చూపు వెనుక పాఠశాల ఉంది, పుస్తకం ఉంది. పేర్ల బందీశాల ఉంది.

ఇద్దరూ self అనే భావనను విచ్ఛిన్నం చేశారు. యు.జి అయితే, 'అహం లేదు' అనే ఆలోచనకూ ప్రాముఖ్యం ఇవ్వడు.

యూజి: ప్రకృతి చూసే మన దృష్టి స్వచ్ఛతను కోల్పోయింది. మనం చూసేది జీవితం కాదు — దాని ఫోటోకాపీ అంటారు

—------’

శంకరాచార్యులు-యు.జి.కృషమూర్తి

సత్యాన్వేషణలో ఇద్దరూ ఋషులే… దారులు వేరు

శంకరుడు: "అహం బ్రహ్మాస్మి" – నేను ఎవరో కాదు, పరబ్రహ్మమే.

యు.జి: "ఇక్కడ ‘నేను’ అనే కేంద్రం లేదు. ఆ భావన ఒక మానసిక నిర్మాణం.”

శంకరుడు: "మాయ వల్లే ప్రపంచ భ్రమ."

యు.జి: "ఇది నిజం కాదని తెలుసుకునే ‘మనసే’ అసలైన మాయ.”

శంకరుడు వేదాలు, ఉపనిషత్తుల ఆధారంగా మాట్లాడాడు.

యు.జి. వాటినే పూర్తిగా తిరస్కరించాడు – "అవి మానవ కల్పనలు" అన్నాడు. తత్వాలన్నీ మానవ భయాల ప్రతిబింబాలు.

శంకరుడు జ్ఞానానుకూలంగా భక్తిని గుర్తించారు.

యు.జి. భక్తి భయానికి మూలం అన్నాడు

శంకరుడు శిష్యులకు బోధించాడు, పాఠాలు నేర్పాడు.

యు.జి: ఎవరినీ మార్చాలని, నేర్పాలని ప్రయత్నించలేదు. "నేను ఉపదేశకుడిని కాదు" అన్నాడు.

శంకరుడు: "జ్ఞాన ద్వారానే మోక్షం సాధ్యం."

యూ.జి: "విముక్తికి జ్ఞానం అడ్డుగోడ!. "జ్ఞానం అనేది conditioning”. నీవు విముక్తిని కోరిన నిమిషమే,

నీవు బానిసవుతున్నావు — నీ తలంపులకి.

శంకరుడు: జ్ఞాన మార్గం వేదాంతం 

యూ.జి: మార్గమని భావనకే నిరాకరణ

శంకరుడు మనస్సు ద్వారా బ్రహ్మాన్ని పొందాలన్నాడు.

యు.జి మనస్సే భ్రాంతి అని తేల్చేశాడు.

శంకరుడు గుణాతీతం కోసం తపస్సు చేశాడు.

యూ.జి. గుణాలనే ధ్వంసం చేశాడు.

శంకరుడు: "శరీరం మారిపోయే వస్తువు. ఆత్మ చైతన్య స్వరూపం."

యూ.జి: "శరీరమే సత్యం. దీని మేధస్సులో ఆత్మ అనే భావన కల్పించబడింది.”

జుడాయిజం - యు.జి

—----------

జుడాయిజం: సత్యం అనేది దేవుని క్రమంలో, ఆయన ఇచ్చిన నియమాల్లో దాగి ఉంది. సత్యం ధర్మగ్రంథాల్లో వెతుకుతాడు.

యు.జి: సత్యం అనేది నీ వెతుకులాట మొదలవకముందే అక్కడే ఉంది — వెతకడమే దాన్ని మాయ చేస్తుంది. వెతకడం అన్నదే భ్రమ.

జుడాయిజం: జీవితం కోసం దేవుడు ఇచ్చిన 613 మిత్వోత్ (ఆజ్ఞలు) పాటించాలి.

యు.జి: నియమాలు, ధర్మాలు అన్నీ బంధాలే. జీవితం మానవ చట్టాలకు లోబడి ఉండదు.

జుడాయిజం: దేవుడు ఒకే సత్య స్వరూపుడు – యెహోవా. ఆయనతో సంబంధమే జీవానికి ఉద్దేశ్యం. దేవుని తోడుగా చూస్తాడు,

యూ.జి: "దేవుడు అనే భావన భయంతో పుట్టిన మానవ మానసిక కల్పన."దేవుడే భయానికి ప్రతి రూపం.

జుడాయిజం: ప్రార్థన, ఉపవాసం, ధర్మాచరణ ముఖ్యమైన సాధనాలు. ప్రార్థనలో సత్యం వెతుకుతాడు,

యు.జి: ఏ సాధననూ గుర్తించడు. మనసుతో చేసే ప్రయత్నమే అసత్యం అంటాడు. ప్రార్థనలోనే మాయ మొదలవుతుంది" అంటాడు.

—---------

కృష్ణ తత్వం (ఇస్కాన్)- యు.జి.

ఇస్కాన్: భగవంతుడిని వ్యక్తిగతంగా ప్రేమించు. శరణాగతి ద్వారా పరమాత్మను పొందాలి 

యుజి: దేవుడు అనే భావన భయంతో పుట్టిన మానసిక కల్పన. సాధనలకన్నా, నిజమైన స్వీయ ఆత్మజ్ఞానం వల్లే విముక్తి వస్తుంది.

ఇస్కాన్: ఆత్మ శాశ్వతమైనది – పరమాత్మునితో ఏకత్వమే లక్ష్యం 

యు.జి: ఆత్మ అనేది జ్ఞాపకాలే – దానికి వాస్తవ ఉనికే లేదు. “శాశ్వత ఆత్మ" అనే భావన మానసిక రూపకల్పనే.

ఇస్కాన్: ఈ లోకం మాయ, భగవత్ సేవే నిజమైన ధర్మం.

యు.జి: ఈ లోకానుభవం అనేది స్మృతి ఆధారిత మాయే.

ఇస్కాన్: సంగీత, నాట్యం హరినామం, భజనలు ద్వారా శుద్ధి 

యు.జి: కళలన్నీ శరీరానుభూతిని తత్త్వంగా మలచే మాయలు

ఇస్కాన్: నీ భక్తి ద్వారా కృష్ణుని చేరుకో.”

యు.జి: నీ భక్తి కూడా నువ్వే సృష్టించుకున్న బంధం.”


యు.జి.కృష్ణమూర్తి భావనలను తెలుగులో తెలుసుకుందామని ఆశక్తి ఉన్నవారు నా బ్లాగు 

 ugtelugu.blogspot.com (అచింతనాపరుడు) నుంచి తెలుసుకోవచ్చు 

సమాజం, సంస్కృతి, జీవితం, పేదరికం, మానవ సంబంధాలు, దేహం, ఇంద్రియాలు, సహజస్థితి, ఆహారపు అలవాట్లు, చైతన్యం, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక గురువులు, గతం, వర్తమానం, దాతృత్వం, మనస్సు, ధ్యానం, ఆలోచన, కవులు, రచయితలు, కళాకారులు..ఇలా భిన్న అంశాలపై యూజీ ఏం చెబుతాడు? అని రేఖా మాత్రంగానైనా తెలుసుకోవడానికి ఈ బ్లాగును దర్శించవచ్చు

No comments:

Post a Comment