‘పాలపిట్ట’లో రాసిన ‘వినదగు యూజీ చెప్పిన...’పుస్తక పరిచయం ‘వినదగు యూజీ చెప్పిన...’
‘జీవితమంటే నిన్నటిదినాలకు మరణించడం, ఏ క్షణానికి ఆ క్షణం జీవించడం’ అని జీవితాన్ని కవిత్వీకరిస్తాం. జననం మరణం, సుఃఖం, దుఃఖం, హింస, అహింస, ఒక్కటే, వేరు వేరు కాదు.’ అని తాత్వకతతో జీవితం లోతుల్లోకి వెళ్లి వాస్తవ దృశ్యాన్ని అద్వైతంలో చెబుతాం. నిజానికి మనం అలా జీవించం. భావనా ప్రపంచంలో విహరిస్తాం. యూజీ కృష్ణమూర్తి (యూజీ) దీనికి పూర్తి భిన్నంగాఈ 40ఏళ్లు అద్వైత స్థితిలో జీవించాడు. ప్రపంచమంతా పర్యటిస్తూ సందర్శకుల మధ్య తెరచిన పుస్తకంలా జీవితం గడిపాడు. తనుగా ఎవరికీ బోధన చేయలేదు. పైగా దానికి వ్యతిరేకం. ‘ గ్రహింపును ఆశిస్తూ మీరిక్కడకు దయచేస్తారు. ఐతే గ్రహించడానికి ఏమీలేదని స్పష్టం చేయడం పైనే నా ఆసక్తి’ అని యూజీ అంటారు. ఎవరైనా కదిలిస్తేనే మిషన్ గన్ లో నుంచి తూటాల్లా మాటలు దూసుకు వస్తాయి. ద్వంద్వం లేని స్థితిలో ఉన్న యూజీకి ఎదురుగా ఉన్నది చిన్నా పెద్దా, సామాన్యులా, ప్రముఖులా అన్న భేదం కనిపించదు. డిప్లమేటిక్ గా, లాజిక్ గా మాట్లాడడు. అందుకే నీవు ఏ అంశంపై అడిగినా ముఖం మీద గుద్దినట్లు సూటిగా, స్పష్టంగా సమాధానం వస్తుంది. అలా తూటాల్లా పేలిన కొన్ని మాటల సమాహారమే ‘ వినదగు యూజీ చెప్పిన...’ పుస్తకం. ఎప్పుడూ ఎలాంటి రచనలు చేయని రాజశేఖర్ నుంచి ఈ పుస్తకం వచ్చిందంటే ఆశ్చర్య మనిపిస్తుంది. ‘యూజీ మాటల్లోని స్వచ్ఛత, సూటిదనానికి అబ్బురపడి ఈ పరమ సత్యాలను ఎవరైనా తెలుగు చేస్తే బావుండు’ అని ఆకాంక్షించిన రాజశేఖరే చివరకు ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. ‘ఎవరు ఈ యూజీ’ అని పాఠకుల్లో ఆసక్తిని రేకెత్తించే సంభాషణలతో, యూజీ చిత్రాలతో పుస్తకాన్ని అందంగా తీసుకు వచ్చారు.
ఇక యూజీ మాటల ప్రవాహం మనకు నూతన ఆలోచనా విధానం, చిట్కాలు, పద్ధతులను ఇవ్వదు. పైగా నేరుగా మన కాలికింద పట్టాను లాగేస్తుంది. ఆశల్ని తుంచేస్తుంది. విశ్వాసాల పునాధులను కూల్చివేస్తుంది. ఇలా అని యూజీ ప్రత్యామ్నాయం చూపించడు. ఎక్కడా నిలబడడానికి స్థానం లేకుండా చేస్తాడు. ‘విత్తనమే కుళ్లిపోయింది, చెట్టును ట్రిమ్ చేయడం కాదు, మూలాలను కట్ చేయడమే నేను చేసేది’ అంటారు. ఉదాహరణకు ప్రకృతి, ఆధ్యాత్మికత, సంస్కృతి, గురువులు మీద యూజీ స్పందన ఇలా ఉంటుంది.
“విలక్షణమైన జీవుల్ని అనంతంగా సృష్టించడంలో ప్రకృతి నిమగ్నమై ఉంది. కాని సంస్కృతి అందరూ ఒకే రీతిలో మసులు కోవాలనే మూసను సృష్టించింది. ఇది ఘోరం. “
“ జీసస్, బుద్ధుడు, లేక కృష్ణుడు లాంటి వారికి ఆదర్శంగా తీసుకొనిఅనుసరించడం వల్ల విలక్షణ వ్వక్తుల్ని పుట్టించగల సృష్టి సామర్థ్యాన్ని నాశనం చేసుకున్నాం.”
“దైనందిన విషయాల పట్ల మీ చుట్టూ జరిగే వారి పట్ల ఆసక్తి లేనందున మీరు అతీతం, కాలరహితం, దైవం, సత్యం, జ్ఞానోదయం మొదలైన వాటిని కల్పించుకొని వాటి కోసం వెతుకుతున్నారు.”
“ మతాధిపతులు ప్రసాదించిన మత పద్ధతిలో నీ ప్రాపంచిక జీవితాన్ని దిద్దుకోవాలనుకుంటే భౌతిక ప్రపంచపు వాస్తవికతను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తూ సామరస్యంగా జీవించే అవకాశాన్ని నాశనం చేసుకోవడమే అవుతుంది.”
“ నిస్వార్థపరుడవడం కోసం ఏదో చేస్తున్నంత కాలం స్వార్థపరుడుగానే మిగిలిపోతావు.”
‘నిన్ను నీవు తెలుసుకో’ అన్నదొక పెద్ద హాస్యోక్తి. ఈ మాట ప్రాచీన జ్ఞానాన్ని పరిరక్షించే పవిత్రాత్ములు మాత్రమే కాదు, ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అంటూనే ఉంటారు. ఆత్మ జ్ఞానం, ఆత్మసాక్షాత్కారం, క్షణ-క్షణం జీవించడం లాంటి చెత్త మాట్లాడడానికి మానసిక శాస్త్రవేత్తలు కూడా ఇష్టపడుతున్నారు.”
యూజీ ఇలా మనకు తెలిసిన మొత్తాన్ని బద్దలు కొడతాడు. ‘ మారాల్సింది ఏమీ లేదంటూనే వంగిన నడుములపై ఘనమని అనాధిగా మోస్తున్న విలువైన మూటలను ఊడదీయించి ఒక్కో వజ్రాన్ని గులకరాయిగా చూపి పారేయిస్తాడు మనతోనే. ఊతకర్రల్ని తన్నేసి, ‘భయం లేదు.నిటారుగా నడువ’మంటాడు అని రచయిత రాజశేఖర్ ఈ పుస్తకం ‘నామాట’ లో యూజీ సంభాషణల సారాన్ని ఒక్క మాటలో చక్కగా చెప్పారు.
No comments:
Post a Comment