యూజీ కృష్ణమూర్తి స్థితిని తెలిపే కీలక సంభాషణ
‘విపత్తు’ తరువాత మొదటి, చివరి పబ్లిక్ టాక్!
(యూజీ మాటలు నేరుగా వినేందుకు వీడియో లింకు, ఆంగ్లంలో ప్రచురితమైన ప్రసంగ పాఠం కూడా మరోలింక్ కింద ఇచ్చాను.. ఆసక్తి ఉన్నవారి కోసం. )
1972లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చర్‌లో ‘విపత్తు’ తర్వాత జరిగిన మొదటి చివరి సభలో యు.జి. కృష్ణమూర్తి మాటల ప్రవాహం ఇలా సాగింది…
“ముందుగా ఈ అవకాశం ఇచ్చిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చర్ అధికారులకు నా ధన్యవాదాలు. మిస్టర్ వెంకటరామయ్య ఆహ్వానాన్ని నేను స్వీకరించడానికి సంకోచించాను. కానీ, ఏదో విధంగా నేను ఈ సభలో మాట్లాడేందుకు ఒప్పించబడ్డాను. మిస్టర్ కొఠారి చెప్పినట్లు, నాకు మాట్లాడటం అస్సలు ఇష్టం లేదు. మీకు ప్రసంగాలు, ఉపన్యాసాలు, చర్చలు, సంభాషణలు వినడం చాలా ఇష్టం అనిపిస్తుంది. కానీ, మీరు ఎప్పుడైనా గ్రహించారా, మీరు ఎవరినీ లేదా ఏదీ నిజంగా వినరు. మీరు ఎప్పుడూ మీ మనసులోని ఆలోచనలనే వింటారు. నాకు ఏమి చెప్పాలో, మీరు ఏమి వినాలనుకుంటున్నారో, నేను ఏమి చేయాలని ఆశిస్తున్నారో తెలియదు. ఇది ఒక చర్చ లేదా సంభాషణగా ఉండాలి ఉంటారు. కానీ నేను తరచూ చెప్పేది ఏమిటంటే - సంభాషణ అనేది సాధ్యపడేది కాదు. అవసరం కూడా లేదు. ఇది మీకు విచిత్రంగా అనిపించవచ్చు. అయినా ఇది నిజమే.
మీరు అనుమతిస్తే, కొన్ని మాటలతో ఈ చర్చను ప్రారంభిస్తాను. ఈ సందర్భంలో నేను "తెలియని స్థితి" గురించి కొన్ని మాటలు చెబుతున్నాను. ‘తెలియని స్థితి’ గురించి ఎవరు ఏమి చెప్పగలరు? అయినా మాటలు ఉపయోగించ తప్పదు. మాటలతో ఎలా చెబితే భావనలలో పడకుండా చెప్పగలమో చూడాలి. ఇది సాధ్యమే. కానీ ఇది - ‘నిర్మౌలిక భావన (non-verbal conceptualization)’ కాదు. అటువంటి మాటే తప్పు - అటువంటి స్థితి అస్సలు ఉండదు.
ఈ "తెలియని స్థితి" నా ప్రత్యేకమైన స్థితి కాదు. ఇది ప్రతి ఒక్కరి సహజ స్థితి. దీన్ని నేను "సహజ స్థితి" అని పిలుస్తాను. ఇది దేవుడు గ్రహించిన మనిషి స్థితి కాదు, ఆత్మసాక్షాత్కార స్థితి కాదు. పవిత్రమైన స్థితి కూడా కాదు. ఇది మీలో ప్రతి ఒక్కరి స్థితి. అందరి సహజ స్థితి. కానీ, మీరు ముక్తి, స్వేచ్ఛ, మోక్షం-ఏ పదం వాడినా-ఏదో స్థితి కోసం, ఎప్పుడూ ఎవరి వైపో చూస్తున్నారు. అందుకే మీరు దారి తప్పుతున్నారు. కాని ఆలోచనలు, పరిమితులను ఎలా అర్థం చేసుకోవాలి? మనకు ఉన్న ఏకైక సాధనం ఆలోచనే. కానీ, ఆలోచన అంటే ఏమిటి? ఎన్నో నిర్వచనాలను ఇవ్వవచ్చు. ఆలోచన అంటే పదార్థం, కంపనం. మనం అంతా ఆలోచన గోళం లోనే ఉన్నాం. ఈ మానవ శరీరం ఒక విద్యుదైస్కాంత క్షేత్రం (ఎలక్ట్రో-మాగ్నెటిక్ ఫీల్డ్). ఇది మన సంస్కృతి ఫలితంగా ఏర్పడిందే. దీనిని మీరు అంగీకరించకపోవచ్చు, కానీ సహజ స్థితిలో ఉండాలంటే, మానవుడు ఇప్పటివరకు ఆలోచించిన, నమ్మిన ప్రతిదీ పక్కన పెట్టాలి. అంటే, మీరు పెరిగిన సంస్కృతిని వదిలేయాలి. ఇది సాధ్యమేనా?. సాధ్యమే. కానీ చాలా కష్టం. ఎందుకంటే మీరు ఆ సంస్కృతిలోంచే పుట్టారు. మీరు దానికే ప్రతిరూపం. మీరు ఆ సంస్కృతి నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోలేరు. అయినప్పటికీ, ఈ సంస్కృతే మీ సహజ స్థితికి అడ్డంకిగా ఉంది.
ఈ ‘సహజ స్థితి’ని మాటల ద్వారా సంగ్రహించి, బంధించి, వ్యక్తీకరించడం సాధ్యమా? కాదు. ఇది మీ అవగాహన స్థితిలో ఉండే విషయం కాదు. ఇది ఎప్పటికీ మీ చైతన్యంలో భాగం కాలేదు. అయితే, నేను ఈ ‘తెలియని స్థితి’ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఆచరణాత్మకంగా చెప్పాలంటే, ఇది ఏమాత్రం ఉనికిలో లేదు. ఇక్కడ, ‘స్పృహ’ అనే పదాన్ని నేను ఏ అర్థంలో ఉపయోగిస్తున్నానో వివరించాలి. మీరు, నేను ఈ పదాన్ని వేర్వేరు అర్థాలలో ఉపయోగిస్తామేమో - నాకు తెలియదు. ఒక వస్తువును మీరు ఎప్పుడు చైతన్యంతో గ్రహిస్తారు? మీ ముందు ఉన్నదానికీ, మీ లోపల ఉండాలనుకునే ఆలోచనకూ మధ్య ఆలోచన వచ్చినప్పుడే. అదే చైతన్యం. కాబట్టి, మీ చుట్టూ ఉన్న వస్తువుల గురించి లేదా వ్యక్తుల గురించి అవగాహన కలిగేందుకు ఆలోచన తప్పనిసరి అవసరం. లేకపోతే, మీరు ఏదీ గ్రహించరు. అదే సమయంలో మీరు అచేతనలో కూడా ఉండరు. కానీ, ఒక స్థితి ఉంది - అది చేతన కాదు, అచేతన కాదు. ఆ ‘చేతన’ తన స్వంత మార్గంలో తనదైన రీతిలో వ్యక్తమవుతుంది. కానీ ఈ వ్యక్తీకరణకు అడ్డంకిగా ఉండేది ఆలోచనల కదలికే.
ఈ ఆలోచన గురించి ఎవరైనా ఏమి చేయగలరు? ఈ ఆలోచనకు లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న శక్తివంతమైన గతి ఉంది. నేను దాని గురించి ఏమైనా చేయగలనా? దాన్ని ఆపగలనా? దాన్ని రూపొందించగలనా? దానికి ఆకారం ఇవ్వగలనా? దాని గురించి ఏమైనా చేయగలనా? కానీ, మన సంస్కృతి, నాగరికత, విద్య-ఇవన్నీ ఆ సాధనాన్ని మన ప్రయోజనాల కోసం ఉపయోగించిల్సిందిగా బలవంతం చేశాయి. కాబట్టి ఈ సాధనాన్ని దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించగలమా? అది సాధ్యం కాదు. అయినప్పటికీ, ఈ ఆలోచన కదలిక విస్తృత స్వభావాన్ని మీరు చూసినప్పుడు, దాని గురించి మీరు ఏమీ చేయలేరని తెలిసినప్పుడు, అది సహజంగా నెమ్మదించి, తన సహజ రీతిలో కొనసాగుతుంది.
నేను ఇలా చెప్పినప్పుడు, భారతదేశంలో కొందరు మాట్లాడే ‘ఆలోచన రహిత స్థితి’ లేదా ‘ధ్యాన స్థితి’ గురించి నేను సూచించడం లేదు. నిజానికి అలాంటి ‘ఆలోచన రహిత స్థితి’ . మీరు పూర్తిగా ఆలోచన రహితంగా మారిపోవడం అంటే, ఒక ‘మృత శరీరం’ అవ్వడం లాంటిది. ఈ రెండు పదాలను ఉపయోగిస్తాను – 'నిర్జీవ శవం'. లేకపోతే, ఆలోచనలు ఉంటాయి. అవి ఎప్పుడూ ఉంటాయి. ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తారని మత గురువులు చెప్పడం మనల్ని మోసం చేయడమే. వారు హామీ ఇస్తారు. ఆలోచనలేని ఆ స్థితిలో (, మౌన స్థితి, ప్రశాంత స్థితి లేదా ‘నిశ్శబ్ద మనసు’ అని రకరకాల పదాలతో ఈ స్థితిని పిలుస్తారు) ‘ఆనందం’, 'పరమానందం’‘పవిత్రత’, ‘ప్రేమ’, ‘మత ఆనందం’ లభిస్తాయని హామీ ఇస్తారు. ఇవన్నీ అసంబద్ధం. ఎందుకంటే, ఆనంద స్థితి అనేది ఉంటే, అది ఎప్పటికీ మీ చేతనలో భాగం కాదు. కాబట్టి, ఈ ఆనంద స్థితుల గురించిన ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలను—ఈ సమస్త అసంబద్ధాన్ని—పూర్తిగా విసిరేయండి. అయితే, ఇప్పుడు ఏమి చేయాలి? ఎవరైనా మీకు సహాయం చేయగలరా? ఎటువంటి బాహ్య శక్తులు మీకు సహాయం చేయలేవు. అంటే, మొదట చెప్పినట్లు, ఇప్పటివరకు మానవుడు ఆలోచించిన, అనుభవించిన ప్రతిదాన్ని పూర్తిగా తిరస్కరించాలి. మీ స్పృహలో ఏ రూపంలోనైనా, ఏ విధంగానైనా, జ్ఞానం ఏ చిన్న జాడైనా ఉన్నంత వరకు, మీరు విభజన స్థితిలోనే జీవిస్తారు.
యు.జి.: అతను [మిస్టర్ కొఠారి] చెప్పినట్టు నేను ‘తెలియని స్థితి’లోకి వచ్చాను. నేను దాన్ని ‘విపత్తు’ (Calamity) అని పిలుస్తాను. ఏమి జరిగింది? నాకు తెలియదు. అకస్మాత్తుగా ఆలోచనలు తన సహజ స్థితిలోకి వచ్చాయి. ఆలోచనల కొనసాగింపు (నిరంతరత్వం) ఆగిపోయింది. కాబట్టి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నది నా ఆలోచనల ఫలితంగా కాదు. నా లోపలి ఆలోచన నిర్మాణం దీనిని సృష్టించలేదు. ఇది ఎలాంటి తార్కిక నిర్ణయం ద్వారా వచ్చిన విషయం కాదు. ఇది ‘ఏమి జరుగుతుందో తెలియని’ స్థితిలో ఉండే ఒక వ్యక్తిత్వపు ప్రత్యక్ష వ్యక్తీకరణ మాత్రమే. అక్కడ నాకు ఏమి జరుగుతుందో తెలియదు. ఈ జీవి (living organism) ఎలా పనిచేస్తుందో కూడా నాకు తెలియదు. [మిస్టర్ కొఠారి] ప్రస్తావించినట్లు, ఇది స్వచ్ఛమైన, సాధారణ భౌతిక, శరీరక ఉనికి స్థితి. దీనికి మతపరమైన అంతర్లీన, లేదా బాహ్య అర్థాలు లేవు. ఎటువంటి ఆధ్యాత్మిక ఛాయలు లేవు. అదే సమయంలో ఇది అసాధారణమైన విషయం. శతాబ్దాల మానవ పరిణామం ఫలితమైన అసాధారణ తెలివిని తనను తాను వ్యక్తం చేసుకోగలుగుతుంది. మనకు సమస్యలు సృష్టించకుండా ఏ సమస్యనైనా, ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలదు.
ప్రశ్న: నీ మాటలను అడ్డగించవచ్చా? నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నాకు చెప్పారు. ఈ విపత్తు సంభవించినప్పుడు, నీవు సాధారణ వస్తువులను కూడా గుర్తించలేకపోయావు. నీ ముందు పుష్పం, మరోటో ఉన్నప్పటికీ నీవు నవజాత శిశువులా అది ఏమిటి అని ప్రతి దాన్నిఅడుగుతుండేవారట. అంటే విపత్తు జరిగినపుడు గుర్తింపు అన్నది పూర్తిగా పోయిందా?
యు.జి.: అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నేను చెప్పినట్లు, ఇది ‘తెలియని స్థితి’. జ్ఞాపకశక్తి నేపథ్యంలో ఉన్నందున, దానికి అవసరమైనపుడు (డిమాండ్ ఉన్నప్పుడు) అది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ అవసరం బయటి నుంచి సృష్టించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి అస్థిత్వం లేదు. ‘నేను’ లేను. కేంద్రం లేదు. అదే సమయంలో ఇక్కడ ఎటువంటి సమన్వయకర్త లేడు. నీవు దాన్ని ఒప్పుకోకపోవచ్చు. నమ్మకపోవచ్చు. కాని అదే వాస్తవం. ఆలోచనలు, భావనల సమగ్రత, సముదాయం ఇక్కడ లేదు.
ఈ మానవ శరీరం బాహ్య ప్రేరణలకు స్పందిస్తుంది. వేలకొద్దీ, బహుశా కోట్లకొద్దీ సంవేదనలు ఈ శరీరంపై దాడి చేస్తున్నాయి. ఇక్కడ ఎటువంటి కేంద్రం, మనసు లేనందున ఏమి జరుగుతుంది? బాహ్య ప్రేరణలకు లేదా ఉద్దీపనలకు, సవాళ్లకు ఈ శరీరం సహజంగా ప్రతిస్పందిస్తుంది. ఈ సంవేదనలను గత అనుభవాలతో అన్వయించేందుకు ఇక్కడ ఎవ్వరూ లేరు. కాని చుట్టూ ఉన్న విషయాలతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ప్రస్తుతంతో నేరుగా జీవించడం ఉంది.
ఉదాహరణకు మీరు ఒక పువ్వు ని చూస్తే అది పువ్వు అని తెలుసుకోవడం లేదు. కానీ ఎవరైనా ఇదేమిటి అని అడిగితే నేపథ్యంలో ఉన్న సమాచారం అది ‘గులాబీ పువ్వు’ అని స్పందింస్తుంది. అది లోపల నుంచి కాదు బాహ్య ప్రేరణ వలన జరుగుతుంది. ఈ చర్య ఎప్పుడూ శరీరం వెలుపల జరుగుతుంది. లోపల కాదు.
ఈ ‘తెలియని స్థితి’కి బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం, లేదా సగుణ బ్రహ్మం వంటి ఆధ్యాత్మిక భావనలతో సంబంధం లేదు. ఈ ‘తెలియని స్థితి’ నీ చుట్టూ ఉన్న వస్తువులతో నేరుగా జీవించే స్థితి. నీవు ఒక పుష్పాన్ని చూస్తూ ఉండవచ్చు. ఇది వెర్రి స్థితి అని నీవు అనుకోవచ్చు. కాని అది సహజ స్థితి. నీవు ఏమి చూస్తున్నావో నీకు తెలియదు. కానీ అది అవసరమైనప్పుడు-ఆ అవసరం ఎప్పుడూ బయటి నుంచి వస్తుంది, “ఇది ఏమిటి?” అని అడిగినప్పుడు, ఈ జీవిలో దాగి ఉన్న జ్ఞానం, సమాచారం బయటకు వచ్చి, అది గులాబీ, ఇది మైక్రోఫోన్, అది మనిషి, ఇది స్త్రీ అని చెప్తుంది. ఈ స్పందన లోపలి నుంచి గాకుండా బయిట పరిస్థితుల వల్ల స్పురిస్తుంది.
యు.జి.: ఈ సంవేదనలు ఎప్పుడూ ఈ జీవిని తాకుతున్నాయని లేదా దాడి చేస్తున్నాయని నాకు ఎలా తెలుసు? ఎందుకంటే ఒక ‘చేతన’ ఉంది. అది తనను తాను గుర్తిస్తుంది. ఇక్కడ ఏ వ్యక్తీ లేరు. ఏ ‘నేను’ లేరు. ఏమి జరుగుతుందో గుర్తించేవాడు ఎవడూ లేడు. ఈ జీవన స్థితి (living organism) తన సొంత రీతిలో, సహజమైన మార్గంలో పనిచేస్తుంది.
మిస్టర్ కొఠారి: యు.జి., నాకు అనిపించేది ఏమిటంటే, ఈ స్థితిని నిర్గుణ బ్రహ్మం, ఆత్మన్,‘భూమ’ (పరిపూర్ణత) అకాల్ (కాలాతీత) అనే పదాలతో పిలుస్తారు. మరొకరు ‘తెలియనిది’ అంటారు, మరో వ్యక్తి వేరేదో చెప్తాడు—అందరూ దీనిని వర్ణించలేమని, “నేతి, నేతి” అని చెప్తారు. అంటే, “ఇది కాదు, ఇది కాదు” అంటారు. అసలు అది చెప్పలేనిదని అందరూ చెబుతారు. బహుశా వారు మీరు చెప్పే సంపూర్ణతనే సూచిస్తున్నారేమో. నా అవగాహన ప్రకారం, బ్రహ్మం అంటే ‘సమగ్రత’. ఈ స్థితిని ఆ పదాలతో అనువదిస్తే, బహుశా ఇదే బ్రహ్మం స్థితి కావచ్చు. ఆలోచనలు మాత్రం మనల్ని ‘అల్ప’ గా (పరిమితం) ఉంచుతాయి. ‘భూమ’ను (పరిపూర్ణతను) పరిమితం చేస్తాయి. ఆ పరిమితి వల్లనే మనలో వ్యక్తిత్వం ఏర్పడుతోంది. నేను తప్పుగా అర్థం చేసుకోవచ్చు — కానీ కొత్త తరం వ్యక్తులకు పాత పదాలు తెలియకపోవచ్చు. అందుకే మీరు కొత్త పదాలు ఉపయోగిస్తున్నారు. ఈ స్థితిలోకి వచ్చిన ప్రతి గురువు, ప్రతి వ్యక్తి, తమ నేపథ్యం ప్రకారం వేరే పదం, వేరే పదబంధాన్ని ఉపయోగించారు. కానీ వ్యక్తిగతంగా, నీవు చెప్పేది అదే అని నేను భావిస్తున్నాను. ఇది నీవు చెప్పేదానికి ఒక వ్యాఖ్యానం.
యు.జి.: నేను ఏమి చెప్పాలని మీరు కోరుకుంటున్నారు? [నవ్వు].
వారికి ఏమి ఉందో అర్థమైతే, వారు ఇక్కడ ఉండేవారు కాదు. వారు ఎవరి దగ్గరికీ వెళ్ళేవారు కాదు. వారు ఈ ప్రశ్నలను అస్సలు అడిగేవారు కాదు. నేను చెప్పేదాన్ని వారు వారి ప్రత్యేక అభిరుచి లేదా వారి ప్రత్యేక నేపథ్యం పరంగా అనువదిస్తే, అది వారి విషాదం; అది వారి దుఃఖం అవుతుంది. అది వారికి ఎప్పటికీ సహాయపడదు. ఇది నా ప్రశ్న. అది మీకు సహాయపడిందా? మీరు ఈ పదబంధాల్లో ఎందుకు ఇరుక్కుపోతున్నారు? ఇవి కేవలం పదాలే. ఒకసారి మీరు గ్రహించినప్పుడు, ఒకసారి ఇది అర్థమైనప్పుడు — ఈ యంత్రాంగం ఎలా పనిచేస్తోంది, ఎంత స్వయంచాలకంగా ఉంది, ఎంత యాంత్రికంగా ఉందో అర్థం చేసుకుంటే ఈ పదబంధాలన్నింటికీ అసలు అర్థం లేదని మీరు గ్రహిస్తారు.
నేను ఈ పదబంధాలను ఎందుకు ఉపయోగిస్తున్నావని మీరు అడగవచ్చు. ఎందుకంటే మీరు, నేను ఈ దురదృష్టకర పరిస్థితిని సృష్టించాం. ఇక్కడ మీరు నన్ను వేదికపై ఉంచి, మాట్లాడమని అడిగారు. సహజంగా, నేను మొదట చెప్పినట్లు, నేను పదాలను ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి, నేను మాట్లాడడం ఆపిన క్షణంలో, లోపల అంతా ఆగిపోతాయి. అది నిజమేనా? ఇక్కడ [నా విషయంలో] అది నిజమే, ఎందుకంటే ఇక్కడ ఆలోచనలకు నిరంతరత్వం (కొనసాగింపు) లేదు.
మనం అతను [మిస్టర్ కొఠారి] ప్రస్తావించిన విషయానికి తిరిగి వెళదాం. ఉదాహరణకు ఇక్కడ ఒక టేబుల్ ఉంది. అది ఏమిటో నాకు తెలియదు. అదే సమయంలో, నీవు నన్ను “అది ఏమిటి?” అని అడిగితే నేను వెంటనే అది టేబుల్ అని చెప్తాను. ఆ జ్ఞానం నేపథ్యంలో ఉంది. అది స్వయంచాలకంగా, బాణంలా వస్తుంది. లేకపోతే, ఇది కేవలం [నా అనుభవం] ప్రతిబింబం అవుతుంది. నేను దీన్ని “బింబవతు [ప్రతిబింబం]” అని పిలవడం లేదు. కానీ నేను ఆ పదాన్ని ఉపయోగించాలి. ఇది ఈ వస్తువును ఖచ్చితంగా అలాగే ప్రతిబింబిస్తుంది. మీరు ఈ పదాలను మీ భావనలతో జోడిస్తారు కాబట్టి నేను ఈ ఆధ్యాత్మిక పదబంధాలను ఉపయోగించాలనుకోవడం లేదు. ఎందుకంటే నీవు వాటిని నీ సొంత సమాంతర ఆలోచనల పరంగా వెంటనే అనువదిస్తావు. ఇక్కడ వస్తువుకు స్వతంత్రంగా ఎటువంటి కర్త లేదు. కాబట్టి, ఇక్కడ [నా లోపల] ఏమీ లేదు. మీరు ఏమి చూస్తున్నారో మీకు తెలియదు. మీరు తిరిగి చూస్తే ఆ వస్తువు పూర్తిగా అదృశ్యమై మరోటి కనిపిస్తుంది. ఇది అక్కడ నుంచి పూర్తిగా మాయమైపోతుంది. కాని మీరు అదేమిటో తెలుసుకోలేరు. అందుకే నేను దీన్ని ‘తెలియని స్థితి” అని చెప్తున్నాను. బహుశా మీరు ఈ విషయాలకు సమాంతరాలను కనుగొంటారు. నేను చెప్పదలచుకున్నది, మీరందరూ ఈ క్షణంలో చేస్తున్నది (ఆలోచనలు, విశ్లేషణలు) లేకపోవడమే నేను వివరిస్తున్న స్థితి. ఇది కేవలం నా స్థితి మాత్రమే కాదు. మీరు కూడా ఇలానే పని చేస్తున్నారు. కాని మీరు దాన్ని గమనించడం లేదు.
యు.జి.: నేను స్పెక్ట్రోస్కోపీ (కాంతి వికిరణాల అధ్యయనం) రంగంలో జరుగుతున్న ఒక ఉదాహరణ ఇవ్వనా?. నేను పుస్తకాలు చదవను. కానీ కొన్నిసార్లు పత్రికలు చూస్తాను. నాకు ఈ విషయాలపై ఆసక్తి ఉంటుంది. వారు వస్తువుల ఫోటోలు తీయడానికి అత్యంత శక్తివంతమైన లెన్స్‌లను అభివృద్ధి చేశారు. వారు మైక్రో-సెకన్లు, నానో-సెకన్లు, పికో-సెకన్లు (సెకనులో కోట్ల వంతు సమయం) వంటి సూక్ష్మ స్థాయిలో కొలమానాలను అభివృద్ధి చేశారు. ఇది మీకు, నాకు అర్థం కాదు—ఇవి సాంకేతిక భాష. ఇప్పుడు వారు వస్తువుల చిత్రాలను ఉదాహరణకు ఈ టేబుల్ ఫోటోను ప్రతి పికో-సెకన్‌కు తీయగలుగుతున్నారు. ప్రతి చిత్రం భిన్నంగా ఉంటుంది. అదే విధంగా, ఆ వస్తువు ప్రతిబింబం ఒకసారి కొత్తగా ఉంటుంది; మరొకసారి నీవు ఈ వైపు తిరిగి మళ్లీ చూస్తే-అది మళ్లీ కొత్తగా ఉంటుంది. కానీ దీన్ని కొత్తది, పాతది అనే పదాలలో అనువదించవద్దు. ఇది మీకు స్పష్టంగా తెలియజేయలేనిది. ఇది ఎప్పటికీ మీ అనుభవ నిర్మాణంలో భాగం కాదు. నేను మీకు చాలా నిర్ధారణలను విసురుతున్నాను. కానీ ఇలాంటి విషయాన్ని మీరు కూడా అనుభవించలేరు.
ఇది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఒక విషయాన్ని అనుభవించడానికి మీరు తప్పనిసరిగా దీనిని నైరూప్యంగా మార్చాలి. కాబట్టి, నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, మీరు మీ స్వంత సహజ స్థితిని ఎప్పుడూ అనుభవించలేరు. మీ అనుభవ ప్రపంచంలో ఇది చేరే అవకాశం లేదు. మీరందరూ ఎప్పుడూ ప్రయత్నిస్తున్నది-మీరు కోరుకునేది ఏదైనా-సాక్షాత్కరించడం లేదా కనుగొనడం-దాన్ని ఈ అనుభవ నిర్మాణంలో భాగం చేయడం. కాబట్టి, మీ అనుభవ నిర్మాణం, మీ సహజ స్థితి ఒకే సమయంలో సహజీవనం చేయలేవు.
మిస్టర్ కొఠారి: మీరు చెబుతున్నదాన్ని నేను ఇలా అర్థం చేసుకున్నాను. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. మన కళ్లూ, చెవులూ, ఇతర ఇంద్రియాలూ పరిమితమైనవే కావడంతో - ఆ వేగవంతమైన మార్పులను అవి పసిగట్టలేవు. అవి ప్రతిఫలించలేవు. మీరు చెప్పినట్లుగా, గుర్తింపు అవసరం వచ్చినప్పుడే - ఆలోచన వస్తుంది, పదాలు వస్తాయి - అది మీలోని జీవితాన్ని ప్రభావితం చేసే ఒక మార్గం మాత్రమే. అంతే. పదాలుగా మార్చడానికీ, అన్వయించడానికీ అవసరమైతేనే ఆ పని జరుగుతుంది. తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. మీ స్థితి గురించి నేను అర్థం చేసుకున్నది వివరిస్తున్నానా?
యు.జి.: అది నీవు అర్థం చేసుకున్నది. [నవ్వు]
మిస్టర్ కొఠారి: నేనూ కాదు. ప్రతి ఒక్కరూ ఈ స్థితిని వేరే పదాలతో వివరించారు. కానీ ఇది ఎప్పుడూ కొత్తది. తాజాది. వర్ణించలేనంత అపారమైన సౌందర్యంతో నిండి ఉంటుంది. వారు దానిని చెప్పాలనుకున్నపుడు ఏదో మాటలు ఉపయోగించారు.యు.జి. మాత్రం ‘తాజా’ ‘కొత్త’ అనే పదాలను ఉపయోగించడు. ఎందుకంటే దీన్ని అతను గత అనుభవాలతో దీన్ని పోల్చడం లేదు. అవసరమైనప్పుడు మాత్రమే అనువాదమవుతుంది. లేకపోతే, ప్రతిక్షణం జీవితం అద్భుతంగా, అసాధారణంగా తాజాగా ఉంటుంది. ఇదే నేను అర్థం చేసుకున్నది.
యు.జి.: ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి: ఈ ఆలోచన అనే ప్రక్రియ మొదలవ్వాలంటే, దానికి అవసరం బయటి నుంచే వస్తుంది. ఎప్పుడు, ఎందుకు, ఎలా ఆ అన్వయం (translation) జరగాలో నిర్ణయించేది బయట జరిగే చర్యల వల్ల. అవి ఎప్పుడూ బయట జరుగుతాయి. ఒక అవసరం వచ్చినప్పుడు, ఆ ఆలోచన కొద్ది సేపు వేరుగా నిలబడి ఆ పరిస్థితిని తగినట్టు స్పందిస్తుంది. ఆ తర్వాత మళ్లీ జీవన ప్రవాహంలో కలిసిపోతుంది. కాబట్టి ఆలోచనకు కేవలం క్రియాత్మక విలువ మాత్రమే ఉంది. దానికి వేరే ఎటువంటి విలువ లేదు.
మరొక విషయం ఏమిటంటే - ఆలోచనల నిరంతర ప్రవాహమే మన ఇంద్రియాల సున్నితత్వాన్ని నాశనం చేస్తోంది. ఆలోచనలు ఆగినపుడు, లేదా నిరంతరంగా సాగనపుడు, మన ఇంద్రియాలు అసాధారణమైన సున్నితంగా పని చేయడం మొదలుపెడతాయి.
ఇక్కడ “సున్నితత్వం” అనగా మనసుకు సంబంధించినది కాదు - నా ఉద్దేశ్యం ఇంద్రియాల సున్నితత్వం. మనసు సున్నితత్వం మీ మనస్సు సంబంధించిన ఒక ఉపాయం. మీరు అందరి భావాలకు, మీ చుట్టూ ఉన్న విషయాలకు సున్నితంగా ఉన్న ఒక మనస్థితిని సృష్టించుకోవచ్చు. ఈ అనారోగ్య కరమైన మానసిక స్థితిలో మునిగి, మీరు ఏదో సాధిస్తున్నామని భ్రమించవచ్చు. ఇదే మీరు ఎప్పుడూ చేస్తున్నది. ఇది నిశ్చయంగా ఎదుగుదల కాదు. ఇక్కడ సాధించడానికి ఏమీ లేదు. పొందడానికి ఏమీ లేదు. చేరుకోవడానికి ఏ గమ్యం లేదు. ఈ జీవన స్థితి తన సొంత రీతిలో వ్యక్తమవ్వకుండా అడ్డుకునేది ఆలోచనల కదలికే. ఈ లోకంలో పనిచేయడానికి మాత్రమే ఆలోచన అవసరం. సమయం అంటే ఆలోచనే. ఆలోచన ఉన్నప్పుడే సమయం ఉంటుంది. ఆలోచన ఉన్నప్పుడే కామం ఉంటుంది. ఆలోచన ఉన్నప్పుడే దేవుడు ఉంటాడు. ఆలోచన లేనప్పుడు దేవుడు లేడు, లైంగికత లేదు, ఏమీ లేదు. ఈ మాటలు మీకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కానీ ఇది నిజం.
[మిస్టర్ కోఠారి: "అస్సలు కాదు."] కానీ మీరు ఆచరించే సద్గుణాల మత్తు, నైతిక నియమాల సాధన ఏవీ ఈ స్థితికి పునాధి కావు. నిగ్రహం, బ్రహ్మచర్యం, లైంగిక సంయమనం వంటి పద్ధతులు దీనికి మార్గం కాదు. మీరు వాటిని అనుసరించి గొప్పవాళ్ల మనుకుంటే అది మీ ఇష్టం. నేను మిమ్మల్ని సంస్కరించడానికి లేదా మీకు మార్గదర్శకత్వం చేయడానికి ఇక్కడ లేను. కానీ ఇది ఒక వాస్తవం. వాస్తవాన్ని వాస్తవంగా అర్థం చేసుకోవాలి. ఇది తార్కికంగా నిర్ధారించబడినది కాదు. వివేకబద్ధంగా అర్థం చేసుకోదగినది కాదు. వాస్తవం ఒక చలనం. సత్యం చలనం. యథార్థం చలనం. కానీ నేను ఈ పదాలను ఉపయోగించడం ఇష్టపడటం లేదు - ఇవన్నీ మీకు తెలిసిన, "లోడ్" అయిన పదాలు. మీరు ఇవన్నీ ఎంతో అధ్యయనం చేసారు - ఇదే మీ దుఃఖం. ఇక్కడ మాట్లాడుతున్నది మీకు పూర్తిగా తెలియని విషయం. నాకు దీని గురించి తెలుసునని నేను చెప్పడం లేదు. నాకు కూడా తెలియదు. అందుకే నేను "తెలియదు" అంటున్నాను. ఇది ‘తెలియని స్థితి’. దేవుడిని వదిలేయండి, వాస్తవికతను వదిలేయండి, అంతిమమైనది లేదా మరేదైనా. నేను దేనిని చూస్తున్నానో నాకు తెలియదు. రోజూ రాత్రింబవళ్లు నాతో ఉన్న వ్యక్తిని కూడా నేను ఏమిటో తెలుసుకోలేకపోతున్నాను. ఈ స్థితిని ఒక మానసిక వైద్యుడికి చెప్పినట్లయితే, అతను నన్ను బెడ్ మీద పడుకోబెట్టి, "ఇతనికి ఏదో తీవ్రమైన సమస్య ఉంది" అని నిర్ధారణకు రావచ్చు. కానీ నేను మిగతా మనుషులలాగే సాధారణంగా పనిచేస్తున్నాను. అతనికి ఇది అర్థం కాదు - అది అతని సమస్య. కాబట్టి, మీరు చేసే అన్వేషణ - సత్యం, దేవుడు, యథార్థం, ఏ పేరుతోనైనా – అదంతా ఒక ‘నకిలీ ఆట,.తప్పుడు విషయం. మీరంతా ఒక “మెర్రీ-గో-రౌండ్” (ఉల్లాస చక్రం) లో ఉన్నారు. దీనిని ఎక్కి, చుట్టూ తిరుగుతూ, మళ్లీ మళ్లీ అదే చేస్తున్నారు.
తెలియనిదాన్ని ఎలా కోరుకుంటారు? తెలియని దాన్ని ఎలా అన్వేషిస్తారు? కానీ మీరు ఎతుకుతున్నారు. మీకు ఇప్పటికే అన్నీ తెలిసినట్లు మీరు ప్రవర్తిస్తున్నారు. ఈ "స్థితి" గురించి విన్న వివరణలతో మీరు ఒక ఊహాచిత్రాన్ని సృష్టించుకున్నారు. ఈ స్థితి అంటే ఏమిటి? ’ ఒకరు నన్ను అడిగారు: -’మీరు ఏ స్థితిలో ఉన్నారు?’-అని… నా జవాబు: ‘ఏ స్థితి? మైసూర్ రాష్ట్రమా, తమిళనాడా? మీరు ఏ స్థితి గురించి మాట్లాడుతున్నారు? ’ఇదే మీ సహజ స్థితి’.. కానీ మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడరు. మీరు మీ సహజ స్థితిలో ఉండాలని కోరుకోవడం లేదు. మీ సహజ స్థితిలో ఉండటానికి అసాధారణమైన తెలివి కావాలి - మీరు ‘మీరుగా ఉండటానికి’ ధైర్యం కావాలి.
మీరు ఎప్పుడూ ఇతరుల్లా మారాలనుకుంటారు. ఏసు, బుద్ధుడు, శంకరాచార్యుడు… ఎవరో ఒకరిని అనుకరించాలనుకుంటారు. కానీ మీరు వాళ్లను పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారి వెనుక ఉన్న నిజమేమిటో మీకు తెలియదు. చివరికి చేస్తే బట్టల మార్చడమే - పింక్ లోంచి కాషాయంగా, కాషాయంలోంచి పసుపు, పసుపు నుంచి మళ్లీ పింక్‌గా. మీ అభిరుచిని బట్టి. అంతే!
మీకు తెలియని దాన్ని మీరు ఎలా కోరగలరు? ఎలా వెతుకగలరు? కాబట్టి ఈ వెతుకులాటకు అర్థం లేదు.
అన్వేషణ ఆగినప్పుడే, ఉన్నది స్వయంగా వ్యక్తమవుతుంది. మీరు దాన్ని మార్చలేరు. దాన్ని నియంత్రించలేరు. అది ఒక అద్భుతమైన మేధస్సుతో పని చేస్తుంది — అది మీలో కాదు, మీ వెలుపల. మీరు మీరుగా ఉండటం చాలా సులభం. కానీ మీరు మీ స్థితిలో ఉండాలని కోరుకోవడం లేదు. మీరు వేరొకరు కావాలని, వేరొకరి జీవితాన్ని అనుకరించాలని కోరుకుంటారు. అదే మీ సమస్య. మీరు మీరుగా ఉండటానికి అస్సలు సమయం అవసరం లేదు. కానీ మీరు కాలాతీతత గురించి మాట్లాడుతారు, అది ఒక పరిహాసమే. మంచివాడిగా, ఆధ్యాత్మికుడిగా, శాంతి లేదా ఆనంద స్థితిలో ఉండాలంటే సమయం కావాలి. అది ఎప్పుడూ "రేపు" అవుతుంది. రేపు వచ్చినప్పుడు, "లల్లా, ఎల్లుండి" అంటారు. ఇదే ‘సమయం’. నేను తత్వశాస్త్రపరమైన సమయం గురించి మాట్లాడటం లేదు. "కాలరహితం" అనేది లేదు.
నేను నిర్ధారణలు చేస్తున్నాను - మీరు వాటిని వ్యతిరేకిస్తారు. ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. మీరు దానిని అంగీకరించే లేదా తిరస్కరించే స్థితిలో కూడా లేరని నాకు తెలుసు. మీరు తిరస్కరిస్తే అది మీ తత్వశాస్త్రపు మూర్ఖపు మూసలోకి ఇది సరిపోదు కాబట్టి మాత్రమే. మీ శంకర, గౌడపాద, రామానుజ, మధ్వాచార్యుల తత్వాలతో కలిపేయడానికి ఇవి సరిపోవు. కాబట్టి, మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోగలరు? ఒక్కటే మార్గం - ఈ మొత్తం వ్యవహారాన్ని వదిలేయడం. అందుకే దీనికి అసాధారణమైన ధైర్యం కావాలి. ఎవరెస్ట్ ఎక్కడం, సముద్రాలు దాటడం వంటి ధైర్యం కాదు. మీరు భగవద్గీత, బ్రహ్మసూత్రాల నుండి "కశ్చిద్ధీరః", "అభయం బ్రహ్మ" వంటి వాక్యాలను ఎందుకు ఉటంకిస్తారు? ఇవి యాంత్రికంగా పునరావృతమయ్యే పదాలు మాత్రమే. "మీరు ఎలా ఉన్నారు?" అని అడిగితే, "ఫైన్ గా ఉన్నాను’ అని అమెరికాలో జవాబు చెప్తారు. సరిగ్గా ఇదే విధంగా, మీరు ఈ పదాలను విసిరేస్తున్నారు. మీలో ఈ యంత్రికనిర్మాణం ఎలా పనిచేస్తుందో అర్థమైతే, ఈ విషయాలను శాశ్వతంగా చర్చించడంలో ఉన్న అసంబద్ధతను మీరు చూస్తారు. ఈ మొత్తం చర్చ నిరర్థకమని తెలుస్తుంది. ‘మీరు ఈ వ్యర్థపనిని కిటికీలోంచి విసిరేసి, బయటకు వెళ్లగలరా?’
మిస్టర్ కొఠారి: నిజానికి ఆయన ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవాలంటే… నేను గత ఐదు సంవత్సరాలుగా ఆయనను కలుస్తూ వస్తున్నాను. నేను ఉపనిషత్తులు మొదలైన వాటిని చదివిన కారణంగా, చాలాసార్లు ఆయన మాటలు వినగానే ఈశావాస్యోపనిషత్తులో ఉన్న “అస్మై నయతు పథా” అనే వాక్యం గుర్తొస్తుంది. అంటే “ఓ అగ్ని, మమ్మల్ని సరైన మార్గంలో నడిపించు” అని. ఆయనలో ఒక రకమైన అగ్ని ఉంది అని నేను భావిస్తాను. అది అర్థం చేసుకోలేని వారికి భయభ్రాంతులను చేయగలదు.
నా అవగాహన ప్రకారం, అతను ఏ సిద్దాంతాన్ని ప్రతిపాదించడం లేదు. అతని మొత్తం దృష్టికోణం పూర్తిగా భిన్నమైనది. అతనికి ఎటువంటి వ్యవస్థ లేదు. అతను చెప్పేది ఒక్కటే. ‘ఇది మీ సహజ స్థీతి’. కాని మీరు సాధించాలనుకునే ఆధ్యాత్మిక స్థితులు అన్నీ మానసిక నిర్మాణాలను బలపరిచే వ్యర్థ ప్రయత్నాలు. ఇవే మీ బాధలకు, సమస్యలకు మూల కారణాలని అతను చెప్తాడు. అతను స్వయంగా దీన్ని చూశాడు. అనుభవించాడు అనిపిస్తుంది. ఆ నిర్మాణం ఒక్కసారిగా కూలిపోయింది. లోపల అంతా ఛిన్నాభిన్నమైంది. అతను చెప్పినట్లు, అతనికి కూడా అది తెలియదు. అదే ‘తెలియని స్థితి’. అతను ఇలా చెప్పినప్పుడు, నాకు జ్ఞానేశ్వర్ మాటలు గుర్తుకు వస్తాయి: ‘నాకు నేను ఎవరో తెలియదు. నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు తెలియదు. అవిద్య కూడా పోయింది. విజ్ఞానమూ పోయింది’.
నేను ఇక్కడ అందరికీ గుర్తుచేయాలనుకుంటున్నది ఏమిటంటే అతని వ్యక్తీకరణలోని కొత్తదనం… కానీ అతను తెలియజేయాలనుకునే సత్యం మాత్రం పాతదైనప్పటికీ, ఇది నేను మాట్లాడే పదాల కంటే, నేను మీపై విసిరే శబ్దాల కంటే కూడా తాజాగా ఉంది. ఇది సనాతనం [పురాతనం]. కానీ, దీనికి పూర్తి ధైర్యం అవసరమని అతను చెప్తాడు. అతనిలో నేను గమనించిన మరో విషయం-నేను అతని గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను-కానీ అతనికి వ్యక్తిత్వం లేదనే విషయాన్ని గుర్తుంచుకుంటే, ఇది పెద్ద విషయం కాదు! [నవ్వులు]-అతనిలో అసాధారణమైన నిర్భయత్వం, “అభయం తత్త్వ సంసుప్తిః” ఉంది. ఇది భగవద్గీత లో చెప్పే దైవిక గుణాలలో ఒకటి. ఇది సాధారణ మనుషులలో కనబడే జంతు భయం అతనిలో కనిపించదు. కానీ, అతను ఆ స్థితి నుంచే మాట్లాడుతున్నాడు. అతను ఆ స్థితికి ఎలా వచ్చాడో నాకు తెలియదు. కానీ అతనిలో అసాధారణ నిర్భయత్వం ఉంది. తలవంచని తనం ఉంది. అలా అని అతను అన్ని అద్భుతమైన సద్గుణాలకు పరిపూర్ణ నమూనా కాదు. అతను కోపగించుకుంటాడు. చిరాకు పడతాడు కూడా. కానీ, ఒక క్షణం అతని ముఖంపై కోపం మేఘంలా కనిపిస్తుంది, కానీ ఒక నిమిషం తర్వాత అతని ముఖంపై పూర్ణచంద్రునెలా వెలుగు దర్శనమిస్తుంది. మేఘాలు ఒక్కసారిగా అదృశ్యమవుతాయి. కాబట్టి, నేను చెబుతున్నాను అతను ఎటువంటి వ్యవస్థ లేదని, ఏ పట్టింపూ లేదని చెప్తాడు. బహుశా, అతను తెలియజేసే దానిలో ఏదో సూచన ఉంది. మీకు తువ్వాలు విసిరేయడానికి ధైర్యం లేదని, నిర్భయత్వం లేదని అతను చెప్తాడు. అతను, “మాట్లాడే వ్యక్తిని కూడా విసిరేయండి” అని చెప్తాడు. మీలో కొంత మందికైనా అతను చెప్పదల్చుకున్న దేమిటో స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
ప్రశ్న: మిస్టర్ కొఠారి, శరీరంలో ఆకలి లేదా నొప్పి ఉన్నప్పుడు ఏమవుతుంది?
కొఠారి: మీ ప్రశ్న ఏమిటంటే అతనికి ఆకలి, నొప్పి ఉన్నపుడు ఏమవుతుంది అనా? లేక మీకు ఏమవుతుందని మీ ఉద్దేశమా?
యు.జి.: నేను చెప్తాను. ఆకలి అనేది మనం అనుకునే విధంగా ఉండదు. అది కేవలం శరీర రసాయన క్రియ (chemistry) మాత్రమే. ఇది ఏదైనా ఇతర సంవేదనల లాంటిదే. శరీరంలో ఆకలి అనే అనుభూతి కలిగినప్పుడు, మనసు దానిని గమనిస్తుంది, ఆ వెంటనే అది పోతుంది. ఆహారం కోసం వెతుకుమని అది మిమ్మల్ని ఏమీ నెట్టదు. ఒక అనుభూతి తరువాత మరొకటి వస్తూ ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మీరు చూస్తున్నది అప్పటికే పూర్తయిన ఒక విషయం. మీరు ఆహారం తీసుకోకపోతే, మీ శరీరం బలహీనపడవచ్చు. నాకు ఎవరైనా ఆహారం ఇస్తే నేను తింటాను, లేకపోతే ఆకలి అనేది నిజంగా లేదు. మరి నొప్పి విషయానికొస్తే — శారీరక నొప్పి ఉంది. కానీ, నేను చెప్పినట్టే, ఆలోచనలు కొనసాగడంలేదని, అందుకే ఆ నొప్పి కూడా నిరంతరంగా ఉండదు. అది కేవలం క్షణికమైన దెబ్బలా వస్తుంది – మీరు పదాలు విసిరినట్లు. ఆ నొప్పికి కూడా ఎలాంటి స్థిరత లేదు. "మానసిక నొప్పి" అనే మాటను ఉపయోగించను — ఎందుకంటే, అలా చేస్తే మనం ఇరుకుల్లో పడిపోతాం, అంతటా చిక్కులే. ఇక్కడ ఉన్నదే శారీరక నొప్పి. అంతే. కానీ ఆ శారీరక నొప్పికి నిరంతరత ఉండదు. అందుకే మనం "నొప్పి" అన్నట్టు అది ఎక్కువగా బాధించదు.
ప్రశ్న: ఈ స్థితిలోకి రావడానికి మార్గం లేదా పద్ధతి ఏమిటి?
యు.జి: ‘ఏ స్థితి? మీరు సహజ స్థితిలో ఉండాలని, లేదా మీ గురువు/ఆరాధ్యుడి స్థితిని అనుకరించాలనే కోరికే మిమ్మల్ని మీ నుంచి దూరం చేస్తోంది. ఏ దిశలోనైనా చలనం ఉంటే, అది మిమ్మల్ని మీ నుంచి తప్పిస్తుంది. ఆ చలనం లేనప్పుడే, మీరు మీ సహజ స్థితిలో ఉంటారు. కాబట్టి, సాధన, పద్ధతి, వ్యవస్థ లేదా టెక్నిక్ లు అన్నీ మిమ్మల్ని మీ నుంచి దూరం చేస్తాయి.
నీకు ఈ స్థితి గురించి ఇప్పటికే జ్ఞానం ఉంది.
దురదృష్టవశాత్తూ చాలా మంది దీనిగురించి మాట్లాడేశారు.
ఇప్పుడు నేనూ అదే తప్పు చేస్తున్నానేమో. ‘మీరు వీటన్నింటినీ తోసేసి, నా మీద కూడా రాళ్లు విసిరి వెళ్లిపోండి. ( కోఠారీ: "ఇప్పుడు కాదు!" – నవ్వులు).
నా ఆసక్తి మిమ్మల్ని బయటకు పంపడం, వెళ్లిపోమని చెప్పడం. మీరు అలా చేయగలిగితే, మీరు ఎవరి మాటా వినడానికి వెళ్ళరు. (ప్రేక్షకులలో ఒకరు: "నేను రాళ్లు విసిర్తే, జైలుకు వెళ్లాల్సి వస్తుంది!"). అది మీ సమాజం సమస్య. నేను ఫిర్యాదు చేయను. శరీరానికి దెబ్బ తగిల్తే అదే అంతం... మీరు అలసిపోలేదా? నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇంకా కొనసాగించ వచ్చు. ఇది సరిపోతుందనుకుంటాను.
నేను ఏమీ చెప్పలేదు. నేను చెప్పానని మీరు అనుకున్నదంతా ఒక 'సంచి' మాత్రమే. అది అర్ధవంతంగా ఉందని మీరు అనుకుంటున్నారు. ఇది ఎలా అర్ధవంతంగా ఉంటుంది? అది అర్ధవంతంగా ఉందని మీరు అనుకుంటే, మీకు ఏమీ అర్థం కాలేదు. అది అర్ధవంతం కాదని మీరు అనుకుంటే, అప్పుడు కూడా మీకు అర్థం కాలేదు. ఇవి కేవలం మాటలు - ఈ శబ్దాన్ని వింటున్నారు - మాటలు, మాటలు, మాటలు - ఈ శరీరం నుంచి యాంత్రికంగా వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో నాకు తెలియదు. నాకు తెలిస్తే బాగుండు.
నేను ఈ స్థితికి ఎలా చేరానో తెలిస్తే బాగుండు… ఏ స్థితిలో ఉన్నారో ‘మీరు ఏదో చెప్పండి…” అని ప్రజలు అడిగినప్పుడు నాకు చిరాకు వస్తుంది. ఏ స్థితి గురించి? మీరు ఏ స్థితి గురించి మాట్లాడుతున్నారు? నాకు మైసూరు స్టేట్ తెలుసు. నేను మైసూరు స్టేట్‌లో ఉన్నాను. నేను మైసూరులో ఉన్నానని ఎలా తెలుసు? ఎందుకంటే ప్రజలు నాకు చెప్తారు నేను మైసూరులో ఉన్నానని. మరి మీరు ఏ స్థితిలోకి వెళ్లాలని కోరుకుంటున్నారు? నేను చెప్పేది, అది మీ సహజ స్థితి మాత్రమే అని.
నిన్ను నీ సహజ స్థితి నుంచి దూరంగా తీసుకెళ్లేది - నీవు ఇంకో స్థితిలో ఉండాలనుకునే తాపత్రయం.
నీలా ఉండటానికి సమయం అక్కర్లేదు.
నేను ఒక పల్లెటూరి మూర్ఖుడినయితే, అలాగే ఉంటాను. అంతే కథ. నాకు తెలివైనవాడిగా మారాలనే కోరిక లేదు. నా పొరుగువాడు తన తెలివితేటలతో నన్ను మోసం చేశాడనుకోండి - బాగుంది, అది అతని అదృష్టం. నేను ఏం చేయగలను?
వాస్తవాన్ని అంగీకరించాలి. , ఇదే ప్రపంచం వాస్తవికత. వేరే ప్రపంచం లేదు. ఇంకో వాస్తవికత, అంతిమ వాస్తవికత అంటూ ఏమీ లేదు. ఇదే ఏకైక వాస్తవం.
మీరు ఈ ప్రపంచంలోనే జీవించాలి. ఈ ప్రపంచం నుంచి మీరు పారిపోలేరు. ఈ ప్రపంచం నుంచి ఎలా పారిపోగలరు? ఎందుకంటే మీరే ఆ ప్రపంచం. ఎక్కడికి వెళ్తారు? గుహలో దాక్కుంటారా? అవును, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఆలోచనలను వెంట తీసుకువెళ్తారు. మీ నీడ నుంచి మీరు పారిపోలేరు. అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. కాబట్టి, మీరు ఆలోచన గురించి ఏమీ చేయలేరు. నేను చెప్పేదంతా అదే. ఆలోచన గురించి ఏదో చేయాలనే మీ ప్రయత్నం ఎంత అసంబద్ధమో మీకు తెలిసినప్పుడు - అది సమస్యలను సృష్టిస్తుంది; అది మీకు బాధను కలిగిస్తుంది. దాని గురించి ఏమీ చేయలేరని నీవు గ్రహించినప్పుడు, అది అక్కడ ఉండదు. నీవు ఆ ఆలోచనను ఉపయోగించి ఏదైనా సాధించాలనే ప్రయత్నం చేయడం ఆగిపోతుంది. నేను దీన్ని మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. మీరు కోరుకుంటారు. మీకు ఏమీ అవసరం లేకపోతే, ఆలోచన అనేదే ఉండదు. అర్థమైందా? కోరుకోవడం అంటే ఆలోచించడం, మీరు ఏమి కోరుకుంటున్నారనేది ముఖ్యం కాదు. అర్థమైందా? కోరుకోవడం అంటే ఆలోచించడం, మీరు ఏమి కోరుకుంటున్నారనేది ముఖ్యం కాదు - ఆత్మ సాక్షాత్కారం కావాలనుకున్నా, భగవత్ సాక్షాత్కారం కావాలనుకున్నా - మీరు ఏదైనా కావాలనుకుంటే, దానర్థం మీరు ఈ సాధనాన్ని ఉపయోగించాలి. ఇవి మీ ఆలోచనలు కావు, ఇవి మీ భావాలు కావు. మీకు నచ్చకపోవచ్చు. అవి ఇతరులవి. కానీ నీవు వాటిని నీవిగా మార్చుకోవాలనుకుంటావు.
దురదృష్టవశాత్తు మీరు వాటిని మీ స్వంతం చేసుకున్నారు. అందుకే మీరు ఈ ప్రశ్నలన్నీ అడుగుతారు. ఇంతమంది యోగులు, ఋషులు, స్వాములు, మానవతావాది నాయకులు - బ్రతికినవాళ్లు, చనిపోయిన పవిత్ర పురుషులు - వీళ్లందరినీ నీవు అడిగిన ప్రశ్నలే. వాళ్లు అందరికీ సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
వాళ్లు చక్కని జోలపాటలు (నిష్క్రియాత్మక సిద్ధాంతాలు) రాశారు. నువ్వు వెళ్లి వాటిని విని నిద్రపోవచ్చు - నీకు కావాలంటే.
అదే నీకు కావాల్సింది కూడా.
ఎవరైనా వచ్చి నీ వీపు తట్టి ‘ఓహ్’ బాగానే చేస్తున్నావు. ఇంకా ఎక్కువగా, బాగా చేయి. ముందుకెళ్తే గమ్యం చేరుకుంటావు," అని చెప్పాలనుకుంటున్నావు.
అసలు నీ గమ్యం ఏమిటి?
వినయంగా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం, మృదువుగా మెలికలు తిరిగిన మాటలతో మాట్లాడటం, - ఇదేనా గమ్యం?
నీవు పాశ్చాత్య దేశాల్లోని కొన్ని మఠాలకు వెళ్తే - ట్రాపిస్టులు ఉండే చోటు - అక్కడి సన్యాసులు గుసగుసల్లో మాట్లాడతారు. ఒకరు ఏమి చెప్తున్నారో మరొకరికి అర్థం కాదు. ఇదే ఆధ్యాత్మిక మార్గం రహస్యమని భావిస్తారు. కానీ ఇది పరిహాసాస్పదం.
మిస్టర్ కోఠారి: ఒక మనిషి ప్రేమలో ఉన్నప్పుడు, అతను తన ప్రియురాలితో గుసగుసలాడుతూ మాట్లాడతాడు. ఎవరైనా గుసగుసలాడుతూ మాట్లాడితే మీకు ఎందుకు అభ్యంతరం?
యూ.జి.: నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అతను నిజంగా ప్రేమలో ఉన్నాడా అని నాకు సందేహం. [నవ్వులు]. నిజమైన ప్రేమ ఉంటే, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు.
నీవు నీ భాగస్వామికి "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని భరోసా ఇవ్వాలనుకుంటున్నావు. అలాంటిది అసలు ప్రేమే కాదు. దానికి విలువే లేదు. నీవు దాన్ని ప్రేమ అని పిలవచ్చు, నాకు వాటిల్లో పడాలనిపించదు. అది నిషేధితమైన విషయమే.
"నీవు ప్రేమ గురించి ఏమైనా చెప్తావా?" అని అడుగుతావు. అది కేవలం నాలుగు అక్షరాల పదం. అది ‘కుక్క’, ‘పంది’, ‘ప్రేమ’ లాంటి ఏదైనా పదం లాంటిదే. ఇవన్నీ ఒకటే.
నిజమైన ప్రేమలో ఉన్నప్పుడు ఏమన్నా సంబంధం ఉండగలదా? ఇదే మీ సమస్య.
మీరు ఎల్లప్పుడూ ఇతరులతో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తావు. కానీ మీరు ఎవ్వరితోనూ నిజంగా సంబంధం కలిగి ఉండలేరు.
"ప్రేమ అంటే సంబంధం." "జీవితం అంటే సంబంధం."
ఇవన్నీ అర్థం లేని మాటలు, వట్టి పదాలు.
మీరు వాటిని కంఠస్థం చేసుకుని పునరావృతం చేస్తారు. ఈ రోజుల్లో అవన్నీ అలంకారమైన పదబంధాలుగా మారాయి. "స్వేచ్ఛ", "మొదటి చివరి స్వేచ్ఛ", "మధ్యలో వచ్చే స్వేచ్ఛలు" — ఇవి అన్నీ ఇప్పుడు ఆకర్షణీయ పదాలు అయ్యాయి. మీరు కొత్త పదబంధాలను అర్ధం లేకుండానే ఎక్కువ చేస్తున్నారు. అంతే. ఇదంతా ఏంటి అర్థరహిత జపం? మీరు కొత్తగా కొన్ని మాటలు గమనించి, వాటిని జపిస్తూ ఉంటారు.
నీవు కొత్త పదబంధాల సమూహాన్ని గుర్తుంచుకున్నావు. నీవు చేస్తున్నది అదే. నీవు ఈ అవగాహన, ‘జాగృతి’ గురించి ఎడతెగని చర్చలు చేస్తావు. కానీ మీరు చెప్పే ఆ అవగాహన అంటే ఏంటి? దీన్ని మీరు ఎలా తెలుసుకొంటారు? జీవితంలో ఒక్కసారైనా దీన్ని నిజంగా తెలుసుకుంటే, మీ నిర్మాణం అంతా కూలిపోతుంది. అది తన సహజ స్థానంలో పడిపోతుంది. దాని గురించి నీవు ఏమీ చేయనవసరం లేదు. కాబట్టి, ఇది ఏమాత్రం అర్థం లేనిది. నీవు అవగాహన గురించి మాట్లాడవచ్చు—ఎంపిక లేని అవగాహన లేదా ఇతరత్రా కండిషనింగ్ గురించి మాట్లాడ వచ్చు. కండిషనింగ్ అంటే ఏమిటి? కండిషనింగ్ అంటేనే బుద్ధి. దాన్ని నీవు ఏమీ చేయలేవు. దాని నుంచి నీవు విముక్తి పొందలేవు. నీవు అన్‌కండిషన్ చేసుకోవాలని అనుకుంటే, అది మరో కొత్త కండిషనింగ్‌ను సృష్టిస్తుంది. ఉపనిషత్తులను పునరావృతం చేయడం మానేసి, బదులుగా ఇతర గొప్పగా కనిపించే పుస్తకాలను పట్టుకుని మళ్లీ అదే పునరావృతం చేస్తావు. అంతే జరుగుతుంది.
ప్రశ్న: సంపూర్ణ ఆనందం రహస్యమేమిటి?
U.G.: సంతోషం అనేది లేదు. నేను ఎప్పుడూ నన్ను ఆ ప్రశ్న అడగను. చాలా మంది నన్ను ఆ ప్రశ్న అడుగుతారు: “మీరు సంతోషంగా ఉన్నారా?” ఆ ప్రశ్న ఏమిటి? వింత ప్రశ్న. నేను ఎప్పుడూ నన్ను “నేను సంతోషంగా ఉన్నానా?” అని అడగను. పూర్తి సంతోషం అనేది ఒక కల్పితం.
మిస్టర్ కోఠారి: మీరు చెప్తున్నది "మైండ్ కల్పించిందన్నమాట"?
యూజీ: మనస్సు అనేది లేదు. మైండ్ అనే వస్తువే లేదు. మైండ్ ఎక్కడ ఉంది? మనస్సు శరీరం నుంచీ వేరుగా ఉందా? శరీరం నుంచి భిన్నంగా ఉందా? శరీరం కాకుండా వేరేగా ఉందా? ఈ ప్రశ్నలకు ఎటువంటి అర్థం లేదు. మీరు జరుగుతున్న దాని నుంచి మిమ్మల్ని వేరు చేసుకోవడానికి ఎటువంటి మార్గం లేదు. మీరు మిమ్మల్ని వేరు చేసుకున్న క్షణంలో, అది మిమ్మల్ని మళ్ళీ ఓ జ్ఞానంతో చూసేలా చేస్తుంది. ఆ జ్ఞానం జీవశాస్త్రవేత్తలు, శరీరశాస్త్రవేత్తలు, మనస్తత్వవేత్తలు లేదా మతసంబంధిత వ్యక్తులు ఇచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారానే మీరు చూస్తున్నారు. జ్ఞానం లేకుండా మీరు ఏదీ అనుభవించలేరు.
బ్రహ్మం లేదా వాస్తవం అనుభవించడం అసాధ్యం. మీరు దీన్ని ఏమాత్రం అనుభవించలేరు. కేవలం అమూర్తంగా మాత్రమే. ఆ అమూర్తం అంటే ఏమిటి? మీకు ఉన్న జ్ఞానం. ఇది అక్కడ ఉంచబడింది. మీ తల్లి, మీ పొరుగువాడు లేదా స్నేహితుడు మీకు ఇది టేబుల్ అని చెప్పారు. అది నిజంగా ఏమిటో మీకు ఎప్పటికీ తెలియదు, మీకు చెప్పిన దాన్ని తప్ప. ప్రతిసారి మీరు దీన్ని చూసినప్పుడు, ఇది టేబుల్ అని మీరు మీకు మీరు పునరావృతం చేసుకోవాలి. అది ఎందుకు చేస్తున్నారు? ఇదే నా ప్రశ్న. ఇదే నేను చెప్పే క్రమశిక్షణ, నిరంతరత. మీరు “నేను ఉన్నాను” అని మీకు మీరు భరోసా ఇవ్వాలనుకుంటున్నారు. “నేను” అనేది ఈ పదం తప్ప మరేమీ కాదు. నేను” అన్నదానికి వేరే స్వతంత్ర స్వరూపం లేదు. బహుశా మీకు నా మాటల్లో శంకరాచార్యులగారిని గుర్తు చేసే ఏదైనా దొరికినా, దొరకవచ్చు. దానితో నాకు సంబంధం లేదు.
కొఠారి గారు:] చాలానే ఉంది. ఎందుకంటే ఇదే విషయం వాళ్లు కూడా చెప్పారు.
ప్రశ్న: [అస్పష్టంగా] …“చిత్, చిత్, చిత్” అని చెప్పే ఆ ఆలోచనరహిత స్థితి గురించి…
యూ.జి.: అవును, అవును. “నేను చెప్పే చైతన్యం అంటే అలా వేరుపడే స్థితి కాదు - నిద్రపోతున్నావా, మేలుకుని ఉన్నావా, కలలు కంటున్నావా అన్న విభజన అక్కడ ఉండదు. నాకు బతికున్నానో, చనిపోయానో కూడా తెలీదు. ఇదే నా స్థితి. నాకు నేను తెలుసుకునే మార్గం లేదు. డాక్టర్ వచ్చి చెబుతాడు.నీ ఊపిరితిత్తులను పరిశీలించాలని అనుకుంటే, నీ ఊపిరితిత్తులు బాగున్నాయి. గుండె చప్పుడు ఉంది, ఇది ఉంది, అది ఉంది-నీవు బతికి ఉన్నావు అని చెప్పవచ్చు. అతను ఆ మాట చెబితే సరే, నాకు సంతోషమే. నీవు నన్ను బతికి ఉన్న వ్యక్తిగా భరోసా ఇస్తావు. కానీ…
ప్రశ్న: మీరు మీ సహజ స్థితిలో ఉన్నారని ఏ సమయంలోనైనా మీకు ఎలా తెలుస్తుంది?
యూ.జి: అది, నేను చెప్పినట్లుగా, మీ స్పృహతో కూడిన అస్తిత్వంలో భాగం కాలేదు. అది తనను తాను వ్యక్తం చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఆ వ్యక్తీకరణే శక్తి, అదే చర్య. అది నిరంతరం జరిగిపోతూనే ఉంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక పదం కాదు. నేను చర్య అని చెప్పేది - అది బయట జరుగుతున్నదే. ఇంద్రియాలు ఎప్పటికీ తమ గరిష్ఠ సామర్థ్యంతో పని చేస్తాయి. మీరు ఏదైనా చూస్తానని భావించడంవల్ల కాదు. కనురెప్పలు కూడా ఒక సెకను కాలం కూడా మూసుకునే సమయం లేదు. అవి ఎప్పుడూ తెరిచే ఉండాలి. అవి అలసిపోయినప్పుడు సహజంగానే దానికి [శరీరానికి] దాని స్వంత అంతర్నిర్మిత యంత్రాంగం ఉంటుంది, అది సంచలనాన్ని ఆపివేస్తుంది. దేహం లోపలే ఉన్న సహజవ్యవస్థ పని చేస్తుంది - అనుభూతిని కట్ చేస్తుంది. ఆ తర్వాత మళ్లీ తిరిగి ముందుకు వస్తుంది.
ప్ర: ఆ విధానం ఏమిటి?
యు.జి.: ఆ విధానం ఏమిటి?
ఒకవేళ ఎవరైనా నీకు జవాబు ఇస్తే, నీవు ఎక్కడ ఉన్నావు? నిన్ను నీవు ఆ విధానం నుంచి వేరు చేయగలవా? నేను చెప్పేది ఇదే. మీరు దానిని విడదీసి చూడగలిగేది జ్ఞానం ద్వారా మాత్రమే. ఆ జ్ఞానం ఒక వైద్యుడు ఇచ్చినా, లేక ఒక సాధువు ఇచ్చినా, లేక ఒక ఋషి ఇచ్చినా.. ఆ జ్ఞానం విలువలేనిది. ఎందుకంటే నీవు చూస్తున్న దానిపై ఈ జ్ఞానాన్ని ప్రక్షేపిస్తున్నావు (ప్రోజెక్ట్ చేస్తున్నావు). ఆ జ్ఞానమే అనుభవాలను సృష్టిస్తోంది. అది ఎన్నటికీ ఆ అనుభవ నిర్మాణంలో భాగం కాదు. అది సమస్య. నీవు దీన్ని అనుభవించాలని కోరుకుంటావు. కాని దీన్ని అస్సలు అనుభవించలేవు. నేను చెప్పే చైతన్యం అయినా, జీవించిన స్థితి అయినా, తెలియని స్థితి అయినా, చుట్టూ ఉన్న వాస్తవం అయినా - దీన్ని మీరు అనుభవించలేరు. ఇది ఎలా వ్యక్తమవుతోంది అంటే - ఇది శక్తిగా వ్యక్తమవుతోంది, చర్యగా వ్యక్తమవుతోంది - అది దాని మార్గంలోనే జరుగుతుంది.
నేను కొన్ని పదాలను ఉపయోగిస్తే “ఇది తనను తానే తెలుసుకుంది”, “ఇది అంతులేని లోతును గమనిస్తుంది”, “ఇది తనే చైతన్యంగా గుర్తిస్తుంది” అని చెప్పినా - ఇవన్నీ మీకు మిస్టిక్ మాటలుగా వినిపిస్తాయేమో - కానీ నీవు దీన్ని అసలు అనుభవించలేవు. నేను మాట్లాడుతున్న చైతన్యం అయినా, జీవన స్థితి అయినా, తెలియని స్థితి అయినా, లేక నీ చుట్టూ ఉన్న వస్తువులు అయినా…అది ఎలా వ్యక్తం అవుతోంది?
అది శక్తిగా వ్యక్తం అవుతోంది. అది తన స్వంత మార్గంలో చర్యగా వ్యక్తం అవుతోంది. నేను కొన్ని పదాలను ఉపయోగిస్తే, “అది తనను తాను అవగాహన చేసుకుంటుంది, “అది తన అద్భుతమైన లోతును అవగాహన చేసుకుంటుంది”, “అది తనను తాను స్పృహలో ఉంచుకుంటుంది;” - ఈ పదబంధాలు నీకు చాలా ఆధ్యాత్మికంగా అనిపించవచ్చు - కానీ నీవు [దాన్ని] అనుభవించలేవు. అది ఎలా వ్యక్తం అవుతోంది? మెదడు శాస్త్రవేత్తలు - వారిని ఉదహరిస్తే - మెదడును అర్థం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. వారు ఒక నిర్వచనానికి వచ్చినట్టు చెబుతున్నారు - వారు మెదడును, మనం ఆలోచిస్తామని భావించే సాధనంగా నిర్వచించారు. వాళ్లకూ ఇంకా ఖచ్చితంగా తెలియదు. నీవు నీ మెదడుని, దాని కార్యకలాపాలను విడదీసి చూడలేవు. నీవు నీ వీపును చూసి, నీ వీపు గురించి ఏదైనా చెప్పగలవా? మీకు ఇంకొకరు చెప్పాలి. అతనికి తన సొంత ఊహలు, అతిశయోక్తి ఆలోచనలు ఉంటాయి. డాక్టర్ తన దృష్టికనుగుణంగా చెప్పేస్తాడు - “ఈ మనిషి బాగోలేదు, ఈ మనిషి వెనుక భాగం సరిగా లేదు” అని. లేదా కళాకారుడైతే, అతను వేరే వివరణ ఇస్తాడు. కాబట్టి, ఇది ఇంకొకరికి చెప్పలేని విషయం. మీ లైంగిక అనుభవాన్ని ఇంకొకరికి చెప్పగలరా?
కొఠారి: “లైంగిక అనుభవమే కాదు, ఏ అనుభవమైనా అలాగే.. అందరూ అదే ప్రయత్నం చేస్తున్నారు - ఓ చిత్రకారుడు, కవి లేదా రచయిత… అతను ఒక అసాధారణ అనుభవాన్ని తన మాధ్యమం అయిన కవిత్వం, శిల్పం ద్వారా వ్యక్తపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు..అతనూ ఇతర హస్తకళాకారుడి మాదిరిగానే.
ప్ర: నీవు నీ ఉనికిని ఈ ప్రపంచంతో ఎలా సమన్వయం చేస్తావు?
యు.జి.: నేను దాని గురించి పట్టించుకోను. నేను ఈ ప్రపంచంలో ఉన్నానా? ఈ ప్రపంచం నా కోసం ఉందా? ప్రపంచం ఎక్కడ ఉంది? నేను ఈ పదబంధాలతో తెలివిగా ఉండడానికి ప్రయత్నించడం లేదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు. నేను మాట్లాడుతున్నానా, నేను ఏదైనా చెప్పుతున్నానా? ఇది నక్క ఊళవడం, కుక్క మొరగడం లేక గాడిద అరవడం లాంటిది. నీవు దీన్ని ఆ స్థాయిలో ఉంచి, ఈ కంపనాన్ని వింటే, నీవు బయటకు వెళ్లిపోతావు. జీవితంలో ఎవరినీ ఎన్నటికీ వినవు. సమాప్తం. ఇది ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి మాటలు కానవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్కరించడానికి ఆత్మ అనేది లేదు. గ్రహించాల్సిన ఏ ‘నేను’(స్వయం) లేదు. ఇక్కడ కేంద్రం లేదు. అది అసాధారణ మార్గంలో పని చేస్తుంది.
ప్ర: ఇంద్రియాల అంతరించిపోవడంలో…, ఇంద్రియాలు అసలు పని చేయకపోతే, ఉదాహరణకు మరణంతో తెలియని స్థితి ఇంకా పని చేస్తుందా
యూ.జి.: మరణం అనేదే లేదు. నీవు ఎన్నటికీ పుట్టలేదు. నీవు అసలు పుట్టలేదు. [నవ్వుతూ] నేను దీన్ని ఆధ్యాత్మికంగా, మార్మికంగా చెప్పడం లేదు. ఎందుకంటే జీవితం అన్నదానికి మొదలు లేదు, అంతం లేదు. దానికి ఆరంభం ఉందా? ముగింపు ఉందా? ఆ ఆరంభాన్ని సృష్టించేది నీ ఆలోచన. మరణం గురించి ఎందుకు ఆందోళన చెందుతావు ? “మరణం” అనేది అసలు లేదు. నీ పుట్టుక, నీ మరణం ఎన్నటికీ ఆ అనుభవ నిర్మాణంలో భాగం కావు. నీవు మరణాన్ని అనుభవించాలనుకుంటే నీవు అక్కడ ఉండవు. [నవ్వు] వేరే ఎవరో అక్కడ ఉంటారు. అది వాడి బాధ. అది వేరే వ్యక్తి దుఃఖం అవుతుంది.
https://o-meditation.com/2009/09/20/first-and-last-public-talk-of-u-g-krishnamurti-after-his-calamity/
https://youtu.be/E-3RLGLRwMs?si=kvxfTnu0dBBopcMs